న్యూఢిల్లీ: కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడం ఎంత ముఖ్యమైన విషయమో.. పౌరసత్వ సవరణ బిల్లూ అంతే ప్రాముఖ్యత కలిగిన అంశమని కేంద్ర రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ ఎంపీలంతా కచ్చితంగా హాజరు కావాలన్నారు. ఆ బిల్లును బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశముందన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మంగళవారం రాజ్‌నాథ్ పార్టీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, పార్లమెంటు సమావేశాలకు ఎంపీలు గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రానున్న రోజుల్లో కీలక బిల్లులు సభ ముందుకు రానున్నందున ఎంపీలంతా తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. బీజేపీ ఎప్పుడూ దేశ ఐక్యత కోసమే పాటుపడుతుందన్నారు. ‘పాక్, బంగ్లా, అఫ్గాన్‌లు ప్రధానంగా ముస్లిం మెజారిటీ దేశాలు. అక్కడ మత వేధింపులకు సాధారణంగా ముస్లిమేతరులే గురి అవుతారు. అందువల్ల ముస్లింలు కానివారికే ఆశ్రయం కల్పించాలన్నది బిల్లు ఉద్దేశం’ అని అన్నారు. సమావేశాల్లో అంశాలపై విపక్ష ఆరోపణలను తిప్పికొట్టాలని ఎంపీలకు ఉద్బోధించారు.
Comments
Please login to add a commentAdd a comment