
చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తాం: జైట్లీ
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. బడ్జెట్‌పై చర్చకు బదులిస్తూ ఆయన సోమవారం సాయంత్రం లోక్‌సభలో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తి చేయాల్సి ఉంది. అందుకు చాలా డబ్బులు అవసరం. ముఖ్యంగా రాజధానికి ఇవ్వాలి.
రెవెన్యూ లోటు ఉంది. గతేడాది దాదాపు రూ. 4 వేల కోట్లు కేటాయించాం. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తం నిధులను మేం ఇస్తున్నాం. అయితే మొదటి సంవత్సరానికి సంబంధించి గతేడాది కొంత ఇచ్చాం. ఈ ఏడాది కూడా ఇస్తాం. రాజధాని నిర్మాణం ముందుకెళుతున్నకొద్దీ వివిధ పథకాల కింద నిధులు కేటాయిస్తాం. పోలవరం ప్రాజెక్టుకు సర్కారు వద్ద ఉన్న నిధులతో పాటు నాబార్డు ఫండ్ నుంచి కూడా ఇస్తాం’ అని పేర్కొన్నారు.