
ప్రత్యేక హోదాపై జైట్లీ దాటవేత
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయంలో గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు నిరాశ పరిచే అంశం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అంశంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్ సభలో మాట్లాడిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్నదానికంటే ఎక్కువగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారే తప్ప ఎక్కడా ఆయన తన ప్రసంగంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట చెప్పలేదు. ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఏపీకి అధనపు నిధులు కేటాయిస్తున్నామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి కొంత మంజూరు చేయాల్సి ఉందే తప్ప మిగతా అన్ని రకాలుగా ఏపీని ఆదుకుంటున్నట్టు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రాష్ట్ర రెవెన్యూ వాటా కింద 21,900 కోట్ల రూపాయలు కేటాయించగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి 6,609 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. అలాగే స్థానిక సంస్థల నిధుల కింద కేంద్రం 1259 కోట్ల రూపాయలు కేటాయించిందని, విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టు కోసం కూడా నిధులు సమకూర్చుతున్నామని చెప్పారు.
అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 2015 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. విభజన చట్టంలో ఏదైతే పొందుపరచారో దానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చామన్నారు. అయితే ఎక్కడ కూడా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తలేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని మాత్రం తమ ప్రభుత్వం చేస్తుందని అరుణ్ జైట్లీ చెప్పడం ద్వారా ఇక ఏపీకి ప్రత్యేక హోదా కల్పించరన్న విషయం దాదాపుగా స్పష్టంగా చేశారు.