పార్టీ నుంచి సీఎంపై సస్పెన్షన్ వేటు!
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూకు పార్టీ ఝలక్ ఇచ్చింది. పెమా ఖండూతో సహా ఏడుగురు నేతలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ తో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా గురువారం రాత్రి వెల్లడించారు. పీపీఏ పక్షనేతగా పెమా ఖండూ ఇక ఎక్కువకాలం ఉండే ప్రసక్తేలేదని ఆయన తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతోనే వారిపై ఈ చర్య తీసుకున్నామని, పెమా ఖండూ నిర్వహించే సమావేశానికి పార్టీ నేతలు ఎవరూ హాజరు అవరాదని ఆదేశాలు జారీచేశారు.
పార్టీ సస్పెన్షన్‌తో సీఎం పెమా ఖండూ పీపీఏ లెజిస్లేచర్ పక్షనేతగా ఉండే అర్హతను కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ గత సెప్టెంబర్ లో పెమా ఖండూ నేతృత్వంలోని 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్డీఏ మిత్రపక్షమైన పీపీఏలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పెమా ఖండూ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. పీపీఏ లెజిస్లేచర్ పార్టీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా వివరించారు.