- సీఎం ఖండూ సహా ఏడుగురిని సస్పెండ్ చేసిన పీపీఏ
- తనకు 49 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఖండూ
- తదుపరి ముఖ్యమంత్రిగా టకమ్ పరియో?
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. సీఎం పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అయితే తమకు మెజారిటీ ఉందని ఖండూ ప్రభుత్వం చెపుతోంది. బీజేపీ కూడా ఖండూకే తమ మద్దతు ప్రకటించింది. అధికార పీపీఏ మాత్రం నాయకత్వ మార్పు తప్పదని సంకేతాలిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలపై గురువారం పీపీఏ తాత్కాలికంగా వేటేయడం తెలిసిందే.
వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేసింది. దీనిపై ఖండూ ప్రభుత్వం శుక్రవారం స్పందిస్తూ.. 60 మంది సభ్యులున్న శాసనసభలో తమకు 49 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పింది. వీరిలో పీపీఏకి చెందిన 35 మంది కూడా ఉన్నారంటోంది. ప్రభుత్వ ప్రతినిధి బమంగ్ ఫెలిక్స్ మాట్లాడుతూ.. 43 మంది పీపీఏ సభ్యుల్లో తమకు 35 మంది మద్దతు ఉందని చెప్పారు. 12 మంది బీజేపీ సభ్యులు, ఒక అనుబంధ సభ్యుడు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా తమకు అనుకూలంగా ఉన్నారన్నారు. సీఎంకుS పూర్తి మెజారిటీ ఉందని, నాయకత్వ మార్పు సమస్యే లేదని అన్నారు.
‘నాయకత్వ మార్పు తప్పదు’
నాయకత్వ మార్పు తప్పదని పీపీఏ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుత కేబినెట్‌లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ మంత్రి టకమ్ పరియో తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పీపీఏ అధ్యక్షుడు ఖాఫా బెంగియా చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ సీఎం నబమ్ టుకీపై తిరుగుబాటుతో రాజకీయ అనిశ్చితి మొదలైంది. ఫిబ్రవరిలో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ రెబల్ నేత ఖలికో పుల్ సీఎం అయ్యారు. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో టుకీ ప్రభుత్వాన్ని కోర్టు పునరుద్ధరించింది. అయితే అసెంబ్లీలో మద్దతు లేకపోవడంతో కొద్ది రోజుల్లోనే టుకీ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో ఖండూ ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించారు. ఆగస్టులో ఖలికో పుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెప్టెంబర్‌లో 42 మంది ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పెమా ఖండూ పీపీఏలో చేరారు.
అరుణాచల్‌లో సంక్షోభం
Published Sat, Dec 31 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
Advertisement
Advertisement