కాశీ ప్రజలు మోసపోకూడదు: కేజ్రీవాల్
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిప్పులు చెరిగారు. మోడీ, రాహుల్ తో వారణాసి ప్రజలు మోసపోకూడదని కేజ్రీవాల్ సూచించారు.
వారణాసి లోకసభకు నామినేషన్ దాఖలు చేసేముందు కేజ్రీవాల్ ర్యాలీ నిర్వహించారు.ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నామినేషన్ కార్యక్రమానికి తాను సాదాసీదా ఓ వాహనంలో వస్తుంటే, మోడీ గురువారం హెలికాఫ్టర్ లో వస్తున్నారు అని ఆరోపించారు.
గత కొన్ని సంవత్సరాలుగా అమేథిలో ప్రజలను మోసగిస్తున్న రాహుల్ ను చూసి కాశీ ప్రజలు మోసపోకూడదని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పంచుకునే నేత అవసరం వారణాసి ప్రజలకు ఉందని కేజ్రీవాల్ తెలిపారు.
వారణాసి లోకసభకు మే 12 తేదిన జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున మోడీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, ఆప్ నుంచి కేజ్రీవాల్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.