టోపీ పెడతాం, పాగా వేస్తాం
రాజకీయ నాయకులు టోపీలు పెడతారని చాలా మంది అంటారు. కానీ ఎన్నికల వేళ టోపీలే కాదు... పాగాలు కూడా పెట్టుకుంటారు. కులాలు, మతాలు, జాతుల ఓట్లను కొల్లగొట్టి ఢిల్లీ కోటలో పాగా వేయాలంటే తలకు పాగాలు పెట్టుకోవాల్సిందే. చాలా సందర్భాల్లో స్థానిక కార్యకర్తలు కూడా తమ తమ సంస్కృతులను ప్రతిబింబించే పాగాలను పెట్టుకొమ్మని నాయకులను కోరుతుంటారు.
అయితే ఇలా చేయడం వల్ల ఓట్లు రాలతాయా అన్నది మాత్రం యక్ష ప్రశ్నే. అసలీ ప్రక్రియను ప్రారంభించింది ఇందిరాగాంధీ. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఆమె పర్యటించినంత విస్తృతంగా బహుశః మరే నాయకుడూ పర్యటించి ఉండరు. ఆయా ప్రాంతాల విశిష్ట దుస్తులను ధరించి, అక్కడి వారితో కలిసి నృత్యం చేయడం వంటివి కూడా ఆమె చేసేవారు. ముఖ్యంగా లంబాడీ, నాగా, అరుణాచల్ వంటి తెగల దుస్తులను ఆమె ధరించేవారు. తరువాత కాలంలో ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ ట్రెండ్ ను క్యాచ్ చేసేశారు.
ఈ సారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ, నరేంద్రమోడీలు ఈ పాగాలు, టోపీలను తెగ ఉపయోగించేస్తున్నారు. దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్న నరేంద్ర మోడీ పొద్దున కర్నాటక పాగా వేసుకుంటే, మధ్యాహ్నం పంజాబ్ పాగా కట్టుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గిరిజనుల వెదురు టోపీ ఒక సారి వేసుకుంటే మరో సారి అస్సాం ప్రజలు వాడే జాపీ అనే టోపీని వేసుకుంటున్నారు.
మొత్తం మీద ఎవరు అధికార కోటలో పాగా వేస్తారో, ఎవరికి ప్రజలు టోపీ పెడతారో త్వరలోనే తేలిపోనుంది.