న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు. వాటర్ ట్యాంకర్ స్కాంకు సంబంధించి ఏసీబీ కేజ్రీవాల్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయం తెలిసిందే. ఈ చర్యను కేజ్రీవాల్ ఓ వైపు స్వాగతిస్తూనే మరోవైపు విమర్శలు చేశారు.
ఈ చర్యతో మోదీ పోరాటం తనతోనే అనేది నేరుగా అంగీకరించినట్లు అయిందని ఆయన ట్విట్ చేశారు. అందుకే వాటర్ ట్యాంకర్ కుంభకోణం కేసులో ఏసీబీ తనపేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందన్నారు. అయితే భయపడేందుకు తాను రాహుల్ గాంధీనో, లేక సోనియా గాంధీనో, రాబర్ట్ వాద్రానో కాదని కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. తాను కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా 2012లో ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 385 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా ఉన్న నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ సుమారు రూ.400 కోట్లు మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కమిటీని వేసి ఆమెపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించడంతో ఏసీబీ షీలా దీక్షిత్తో పాటు కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు షీలా దీక్షిత్తో పాటు, కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు పిలిపించే అవకాశం ఉందని ఏసీబీ చీఫ్ ముఖేష్ మీనా తెలిపారు.