సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళుతున్న విషయంపై కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీంతో వాటిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వలస కార్మికులను ఎక్కడికి వెళ్లవద్దని, ఉన్నచోటే ఆగిపొమ్మని ఢిల్లీ సర్కారు మరోసారి విజ్ఞప్తి చేసింది. మీకు సరైన వసతి సౌకర్యాలతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తామని, అవసరమైతే అద్దె చెల్లించేందుకు సిద్దమేనని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ వలస బాట పట్టిన కూలీలు ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి బాట పట్టి వారి కుటుంబీకులతోపాటు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు.
"చాలా రాష్ట్రాల్లో జనాలు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. వారికి చేతులు జోడించి అడుగుతున్నా.. ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ఏం చెప్పారు. ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోవాలన్నారు. లాక్‌డౌన్ ముఖ్యోద్దేశం ఇదే. దీన్ని మనం పాటించకపోతే కరోనాతో పోరాడుతున్న మన దేశం ఓటమిని చవిచూడక తప్పదు. ఏ ఇద్దరికి కరోనా ఉన్నా అది అందరికీ వ్యాప్తిస్తుంది. దీనివల్ల ముందు నీకు ఆ వైరస్ సోకుతుంది. నువ్వు నీ గ్రామానికి వెళితే అక్కడ నీ గ్రామస్థులకు, అలా అది ఈ దేశమంతటా వ్యాపిస్తుంది. అప్పుడు దాన్ని నివారించడం మరింత కష్టతరమవుతుంది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వలస కార్మికుల కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు స్కూళ్లను తాత్కాలిక వసతి సదుపాయాలుగా మార్చివేసే దిశగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment