ఎన్డీయేలో ఏకపక్షమే | As the BJP's Ambitions Grow, Is the NDA Almost Dead? | Sakshi
Sakshi News home page

ఎన్డీయే ప్రాధాన్యత కోల్పోయిందా?

Published Mon, Sep 11 2017 8:15 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

As the BJP's Ambitions Grow, Is the NDA Almost Dead?

– అన్నీ తానై శాసిస్తున్న బీజేపీ
– నామమాత్రమైన మిత్రపక్షాలు


ఎన్డీయే ప్రాధాన్యత కోల్పోయిందా? నామమాత్రంగా మిగిలిపోయిందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ చూపిస్తున్న దూకుడు, మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు చూస్తే... అవుననే అనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 350 సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది బీజేపీ భావి వైఖరిని ప్రతిఫలిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 2014లో బీజేపీ 282 సీట్లతో సొంతంగా మెజారిటీని సాధించినా... మిత్రధర్మాన్ని పాటించి ఎన్డీయే భాగస్వామ్యపక్షాలకు మోదీ కేబినెట్‌లో చోటు కల్పించారు. అయితే శాఖల కేటాయింపులో ఆధిపత్య ధోరణి కనిపించింది. కీలకమైన శాఖలన్నీ బీజేపీయే అట్టిపెట్టుకుంది.

అప్పటి పరిస్థితి వేరు...
అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో (1998– 2004) ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలకు మంచి విలువ ఉండేది. సమతా పార్టీకి చెందిన జార్జి ఫెర్నాండెజ్‌ ఎన్డీయేకు కన్వీనర్‌. రక్షణమంత్రి కూడా. పలు కేబినెట్‌ కమిటీల్లో సభ్యుడు. రాజకీయ, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎన్డీయే పక్షాల అభిప్రాయాలను తీసుకునే వారు. మిత్రపక్షాల మాట కూడా చెల్లుబాటయ్యేది. నాడు తెలుగుదేశం పార్టీకి 27 మంది ఎంపీలు ఉండటంతో చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో చక్రం తిప్పారు.

ఇప్పుడంతా మోదీమయం...
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, బీజేపీ అయినా, ఎన్డీయే కూటమి అయినా... అంతా మోదీమయం.  జాతీయ రాజకీయాల్లో ఆ స్థాయి కలిగిన నాయకుడు కనబడటం లేదు. అందుకే భాగస్వామ్యపక్షాలైనా సరే... డిమాండ్లు పెట్టే, బెట్టు చేసే పరిస్థితి లేదు. ఈ నెల 3న జరిగిన కేబినెట్‌ పునర్య్వవస్థీకరణలో ఎన్డీయేలోని మిత్రపక్షాలకు మోదీ గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఈ పార్టీల నుంచి ఎవరినీ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తద్వారా ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది, ఎవరి స్థానమేమిటనే విషయాల్లో  విస్పష్ట సందేశం పంపారు.

కలహాల కాపురం...
శివసేనకు చేదు అనుభవం ఎదురైంది. రెండు దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న శివసేనకు లోక్‌సభలో 18 సీట్లున్నాయి. అయినప్పటికీ పునర్వ్యవస్థీకరణలో శివసేనకు చోటు దక్కలేదు. నిజానికి బీజేపీ 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీచేయాలనే ఆలోచన చేస్తోంది. 2014లో పొత్తుపెట్టుకొని బీజేపీ 23, శివసేన 18 స్థానాల్లో గెలిచాయి. 48 స్థానాల్లో 41 ఎన్డీయే ఖాతాలో పడ్డాయి.

అయితే అదే ఏడాది అక్టోబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా... 63 సీట్లు నెగ్గిన శివసేన తర్వాతికాలంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో చేరింది. ఆపై కూడా ఇరుపార్టీల మధ్య సంబంధాలు సజావుగా లేవు. కేంద్ర విధానాలను, రైతుల ఆత్మహత్యల విషయంలో ఫడ్నవీస్‌ సర్కారు వైఖరిని ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంటూనే శివసేన బాహటంగా తప్పుపడుతోంది. ఇటీవల జరిగిన ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఇరుపార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.

ప్చ్‌... టీడీపీ
ఇక తెలుగుదేశం విషయానికి వస్తే... కనీసం రెండు మంత్రి పదవులు వస్తాయని ఆశించి... భంగపడింది. నిజానికి టీడీపీతో కలిసిసాగడం కమళదళానికి ఇష్టం లేదనే వార్తలు వచ్చాయి. వాజ్‌పేయి హయాంలో కీలక మిత్రపక్షనేతగా చంద్రబాబు తరచూ ఢిల్లీలో కనిపించేవారు. సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ మిత్రపక్షాల్లో ఒకదాని అధ్యక్షుడిగానే చంద్రబాబును చూస్తున్నారు తప్పితే... అంతకుమించి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

పాపం... నితీశ్‌
లాలూ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో తెగదెంపులు చేసుకొని... బీజేపీతో ఇటీవలే జట్టుకట్టిన జనతాదళ్‌ యునైటెడ్‌కు కూడా మోదీ పునర్వ్యవస్థీకరణలో షాకిచ్చారు. జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరీ ఎక్కువ మంత్రిపదవులు అడగటంతో ఆ పార్టీని మొత్తానికే దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి. అసలు మంత్రి పదవుల చర్చే రాలేదని జేడీయూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... నితీశ్‌కు ఇది మింగుడుపడని అంశమే. 2019 ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని రేసులో ఉంటారని భావించిన నితీశ్‌ను బీజేపీ వైపు లాగడానికి... మోదీ, అమిత్‌ షాలు వ్యూహాత్మక వైఖరిని అనుసరించి సఫలమయ్యారు.

ప్రధాని ఒకవైపు నితీశ్‌ను బాహటంగా ప్రశంసిస్తూ సానుకూల సంకేతాలు పంపగా, మరోవైపు లాలూపై కేసుల పరంపరతో ఆయనతో కలిసి నడవలేని పరిస్థితిని నితీశ్‌కు కల్పించారు. 2013లో బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీయే నుంచి వైదొలిగిన నితీశ్‌ నాలుగేళ్లకే తిరిగి బీజేపీ పంచన చేరారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జేడీయూను చేర్చుకోకపోవడం ద్వారా ఎవరి స్థానమేమిటో మోదీ చూయించారని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఈ ఏడాది మార్చిలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక మిత్రపక్షం అకాలీదళ్‌ను వదిలించుకోవాలనే డిమాండ్లు బీజేపీలో ఎక్కువవుతున్నాయి.

మిషన్‌– 350
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆగస్టులో పార్టీ ముఖ్యులు, కొందరు మంత్రులతో సమావేశమైనపుడు... 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 350 సీట్లను సాధించడమే బీజేపీ లక్ష్యమని తేల్చిచెప్పారు. హిందీ బెల్ట్‌లో 2014 స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయడం సులభం కాదని కమల దళపతికి తెలుసు. 2014లో మిత్రపక్షాలతో కలిసి తీసుకుంటే... యూపీలో 80 స్థానాల్లో 73, బిహార్లో 40 స్థానాలకుగాను 31, మహారాష్ట్రలో 48 స్థానాల్లో 42, మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకుగాను 27, చత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలకుగాను 10 చోట్ల ఎన్డీయే నెగ్గింది.

రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26)లలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను నిలబెట్టుకోవడం తేలికకాదని అమిత్‌ షా భావిస్తున్నారు. అందుకే 282 సీట్లలో బీజేపీ తొలిసారి గెలిచిన 120 సీట్లపై ప్రత్యేక దృష్టి సారించి... పార్టీ నాయకులకు, మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

తొలిసారి గెలిచిన 120 స్థానాల్లో సగం చోట్ల తిరిగి నెగ్గితే... మిషన్‌ 350 సాధ్యమని షా విశ్వసిస్తున్నారు. యూపీలో ఈ ఏడాది మార్చిలో బీజేపీ ఘన విజయం తర్వాత ఆశలు పెరిగాయి. అయినా గత ఎన్నికల్లో గెలిచిన 71 స్థానాలను నిలబెట్టుకోవడం ఆషామాషీ కాదు. సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ మహాకూటమిగా ఏర్పడితే... బీజేపీ గట్టిపోటీ ఎదురవుతుంది. బిహార్‌లో 2014లో జేడీయూతో పొత్తులేకుండా పోటీచేసినా మంచి ఫలితాలు రాబట్టిన బీజేపీ ఈసారి సంఖ్య తగ్గకూడదనే లెక్కలతో నితీశ్‌ను అక్కున చేర్చుకుంది.

బీసీ నేతగా నితీశ్‌కు ఉన్న గుర్తింపు, క్లీన్‌ ఇమేజ్‌ హిందీ బెల్ట్‌లో తమకు లాభిస్తుందనేది బీజేపీ అంచనా. అలాగే బీజేపీ విజయావకాశాలున్న మరో 115–120 స్థానాలపై (దక్షిణాది, తూర్పు రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని ఈ స్థానాల్లో బీజేపీ ఎప్పుడూ నెగ్గనప్పటికీ గెలిచే అవకాశముందని అంతర్గత సర్వేల ఆధారంగా అమిత్‌ షా భావిస్తున్నారు) ప్రత్యేక దృషి పెట్టారు అమిత్‌ షా.

ఒడిషాలో 21 స్థానాలుండగా... బీజేపీ 2014లో ఒకచోట మాత్రమే గెలిచింది. సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఇక్కడ మెజారిటీ సీట్లపై బీజేపీ దృష్టి సారించింది. అలాగే బెంగాల్, కేరళలలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ బలం పెరుగుతుందనే ధీమాతో ఉంది. 2014లో కర్ణాటకలో 28 స్థానాలకుగాను బీజేపీ 17 చోట్ల నెగ్గింది.

వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోగలమని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ సీట్లను మరింతగా పెంచుకోగలమని భావిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి ఉంది. బీజేపీ కూడా మిషన్‌ 350ని చేరుకునే క్రమంలో కొన్ని మిత్రపక్షాలను వదులుకొని, కొత్త మిత్రులతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement