సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయకు న్యాయం జరగకుంటే హత్యాచారం వంటి తీవ్ర నేరాలకు గురైన ఇతర బాధితులెవరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉండదని నిర్భయ తల్లి ఆశాదేవి స్పష్టం చేశారు. నిర్భయకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందుకు రావాలని ఆమె ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ కోరారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఎనిమిదేళ్లయినా ఇంతవరకూ దోషులను ఉరితీయని క్రమంలో ఆశాదేవి తన కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని, ప్రాధేయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పరిస్థితులు మారినా తాను ఇంకా కోర్టు ముందు చేతులు జోడించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
దోషులను ఉరితీసినా తన పోరాటం కొనసాగుతుందని, ఇది తన ఒక్కరి పోరాటం కాదని, ఈ దేశం బిడ్డల కోసం తన పోరాటం సాగుతుందని ఆశాదేవి స్పష్టం చేశారు. దోషులను వదిలివేయాలని తనను అడుగుతున్న వారు తమ బిడ్డలకు ఇదే జరిగితే వారు దోషులను వదిలివేస్తారా అని ఆమె ప్రశ్నించారు. కోర్టులపై విశ్వాసం సన్నగిల్లినందునే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం హైదరాబాద్‌లో ప్రజలు స్వీట్లు పంచుకున్నారని గుర్తుచేశారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు నిర్భయకు న్యాయం చేయాలని తాను సుప్రీంకోర్టును కోరతానని అన్నారు. మానవహక్కుల కార్యకర్తలు వారి మనుగడ కోసం చెప్పే మాటలు తాను వినదల్చుకోలేదని, దోషులను ఉరితీయాల్సిందేనని తేల్చిచెప్పారు. కోర్టు తన ఎదుటే దోషుల హక్కుల గురించి మాట్లాడుతూ తన బాధను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీయాలని కోర్టు తాజా డెత్‌వారెంట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment