ఇస్లాం పేరుతో రక్తపాతమా.. సిగ్గు సిగ్గు
లష్కరే తాయిబా ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్లోని పాంపోర్లో దాడులకు తెగబడి సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. మతం పేరుతో ఇలాంటి అనాగరిక హత్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడిలో 8 మంది జవాన్లు మరణించగా, 25 మంది గాయపడ్డారు. ఇస్లాం పేరుతో కొంతమంది ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఎలా చేస్తారో తనకు అర్థం కావడం లేదని, అది కూడా పవిత్ర రంజాన్ మాసంలో.. ప్రజలంతా శాంతి, క్షమలను కోరుకుంటుంటే ఇలా చేయడం ఏంటని ఆమె అన్నారు. హుమ్హుమాలోని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయంలో జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించి మెహబూబా ముఫ్తీ మాట్లాడారు.
దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వెంటనే స్పందించి విమర్శలు గుప్పించింది. ఇంతకుముందు ఇదే మెహబూబా ఉగ్రవాదానికి మతం లేదనేవారని, ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి ఆమె ఉగ్రవాదానికి ఇస్లాంకు లింకు పెడుతున్నారని, దీనిపట్ల ముస్లింలు సిగ్గుపడాలని ఆ పార్టీ ప్రతినిధి అజీమ్ మట్టు అన్నారు. ముఖ్యమంత్రి ఇలా చెప్పడం సిగ్గుటేని మండిపడ్డారు.
ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్కు చెడ్డపేరు తెస్తున్నారని, పర్యాటకులు ఈ ప్రాంతానికి రాకుండా అడ్డుపడుతున్నారని సీఎం అన్నారు. చాలా దేశాలు తమ పౌరులకు కశ్మీర్ వెళ్లొద్దని సలహాలు ఇస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. దీంతో వాళ్లేమీ సాధించలేరని, పైగా దీనివల్ల శాంతినే కోరుకునే మతానికి కూడా చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.