పదేళ్ల కిందటే ‘స్వచ్ఛ’ గ్రామం
* ఆసియాలోనే పరిశుభ్రమైన పల్లెగా ‘మావ్లిన్నోంగ్’
* 2003లోనే అంతర్జాతీయ గుర్తింపు
మేఘాలయ: ఎక్కడ చూసినా పచ్చని పచ్చిక.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు.. రహదారుల పక్కనే చెత్త వేసేందుకు వెదురుబుట్టలు.. ఇదంతా విదేశాల్లోని నగరాలు, గ్రామాల గురించి చెపుతున్న సంగతులు కాదు. మనదేశంలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామం గురించిన విశేషాలివీ. ఇది మనదేశంలోనే కాదు ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామం. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉంది ఈ చిన్న గ్రామం. దీని పేరు ‘మావ్లిన్నోంగ్’.
ప్రధాని మోదీ పిలుపుతో ఇప్పుడు దేశంలోని ప్రతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛభారత్ అంటూ పరిశుభ్రతా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే మావ్లిన్నోంగ్ ఎప్పటి నుంచో పరిశుభ్రమైన గ్రామంగా భాసిల్లుతోంది. అందువల్లే దీన్ని ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా 2003లో ఇండియా డిస్కవరీ మేగజీన్ గుర్తించింది. 2007 నాటికే బహిరంగ మల విసర్జనకు స్వస్తి చెప్పిన మావ్లిన్నోంగ్ ప్రజలు గ్రామంలో ఉన్న 91 ఇళ్లలో నిర్మల్ భారత్ అభియాన్‌లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘‘నా చిన్నతనం నుంచే మా గ్రామం పరిశుభ్రంగా ఉంది. మా తాతల కాలం నుంచీ ఇలాగే ఉందని విన్నాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని మావ్లిన్నోంగ్ గ్రామస్తుడు రెండార్ ఖోంగ్‌పోస్రెమ్ చెప్పాడు.
ప్రతి రోజూ ఈ గ్రామాన్ని సుమారు 200 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇండియా డిస్కవరీ మేగజీన్ గుర్తింపు తర్వాత పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. జర్మనీకి చెందిన కెర్లిన్ అలాంటి వారిలో ఒకరు. ఆమె 11 వారాలుగా ఈ గ్రామంలోనే బస చేస్తోంది. ఇంటర్నెట్‌లో చూసి ఈ గ్రామంలో పర్యటించేందుకు వచ్చినట్టు ఆమె తెలిపింది. ‘‘నేనే భారత్‌లో చాలా గ్రామాలను చూశాను. కానీ ఇది భిన్నమైనది. పరిశుభ్రంగా ఉంటుంది. తోటలు ప్రత్యేకమైనవి. ప్రకృతి సంరక్షణకు గ్రామంలో అందరూ పాటుపడతారు. అదే మావ్లిన్నోంగ్ ప్రత్యేకత. ఇది నాకు స్వర్గంలా కనిపిస్తోంది’’ అని కెర్లిన్ చెప్పారు. మరోవైపు మావ్లిన్నోంగ్ భవిష్యత్తులోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుందని గ్రామస్తులు నమ్మకంగా చెపుతున్నారు. పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని నాలుగేళ్ల నుంచే చిన్నారులు కూడా ఇక్కడి స్కూళ్లలో నేర్చుకుంటున్నారు.