సాక్షి, న్యూఢిల్లీ : గౌహటిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనస్థియాలజిస్ట్‌గా పని చేస్తోన్న అస్సాంకు చెందిన 44 ఏళ్ల డాక్టర్ ఉత్పల్‌జిత్ బర్మన్ మార్చి 29వ తేదీన మరణించారు. భారత వైద్య పరిశోధనా మండలి సిఫార్సు మేరకు యాంటీ మలేరియా డ్రగయినా ‘హైడ్రోక్సిక్లోరోక్విన్’ తీసుకోవడంతో మరణించినట్లు ఆయన సహచర వైద్యులు తెలియజేశారు. కరోనా వైరస్ నిర్ధారిత రోగులు లేదా కరోనా రోగులకు వైద్యం చేయడం ద్వారా కరోనా బారిన పడే అవకాశం ఉందని భావించిన వారు ఈ ‘హైడ్రోక్సిక్లోరోక్విన్’ను తీసుకోవాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి సూచించింది.
బర్మన్ పని చస్తోన్న ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన రోగులు ఎవరూ చేరలేదని, అలాంటప్పుడు ముందు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన యాంటీ మలేరియా డ్రగ్‌ను ఆయన ఎందుకు తీసుకున్నారో అర్థం కావడంలేదని సహచర వైద్య సిబ్బంది తెలిపారు. ‘కరోనా వైరస్ నివారణకు హైడ్రోక్సిక్లోరోక్విన్ సరైన మందు కాదు. నేను దీన్ని తీసుకున్న తర్వాత నాకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి’ అని ఆదివారం మధ్యాహ్నం 1.04 గంటలకు డాక్టర్ బర్మన్ తోటి వైద్యులకు మిస్సేజ్ పెట్టారు. ఆ తర్వాత రెండు గంటల తర్వాత నర్సు వత్తిలో కొనసాగుతున్న డాక్టర్ బర్మన్ భార్య, బర్మన్ సహచర వైద్యులకు ఫోన్‌చేసి ఆయనకు గుండెపోటు వచ్చినట్లు చెప్పారు.
సహచర వైద్యులు బర్మన్ ఇంటికి వెళ్లి ఆయన్ని మరో ప్రైవేటు ఆస్పత్రికి హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ 20 నిమిషాల తర్వాత బర్మన్ చనిపోయారు. గుండె కండరాలకు హఠాత్తుగా రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు ఎందుకు వచ్చిందో వారు చెప్పలేక పోయారు. గుండెపోటు వచ్చినప్పుడు తీసే ‘ఎలక్ట్రోకార్డియోగ్రామ్’ తీయకపోవడం, చనిపోయిన తర్వాత అటాప్సీ చే యక పోవడంతో అసలు కారణం వెలుగులోకి రాలేదు. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బర్మన్‌ది గుండెపోటు వచ్చే వయస్సు కాదని, యాంటి మలేరియా డ్రగ్ తీసుకోవడం వల్లనే ఆయన మత్యువు బారిన పడ్డారని సహచర వైద్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment