గువాహటి: ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తుంటే.. కొంతమంది ప్రజాప్రతినిధులు వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్సాల్సింది పోయి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా పరస్పర ఆరోపణలతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కోవిడ్-19 సోకినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత ప్రార్థనలకు హాజరైన వారు వైద్యులకు సహకరించడం లేదంటూ ఓ వర్గం ప్రచారం చేస్తుండగా.. మరోవైపు కరోనా సోకని వారికి డాక్టర్లు బలవంతంగా చికిత్స చేస్తున్నారంటూ మరో వర్గం విరుచుకుపడుతోంది. (కరోనా : బీజేపీ నేత ఫైరింగ్ వీడియో వైరల్)
తాజాగా అసోం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. క్వారంటైన్ సెంటర్లు అక్రమ వలసదారులను బంధించే నిర్బంధ గృహాల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవి కరోనా రోగులకు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ముస్లింలకు వ్యతిరేకంగా అసోం బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. అందుకే క్వారంటైన్ సెంటర్లలో వారిని వైద్యులు వేధిస్తున్నారని ఆరోపించారు. నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిలో ఆరోగ్యవంతులను కూడా అదుపులోకి తీసుకుని వారిని కరోనా పేషెంట్లుగా చిత్రీకరించేందుకు ఇంజక్షన్లు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. (కరోనాపై పోరు: డాక్టర్ కన్నీటిపర్యంతం)
ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోమవారం అమీనుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో మంగళవారం ఆయనను అరెస్టు చేసినట్లు అసోం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంతా వెల్లడించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకవెళ్లామని పేర్కొన్నారు. కాగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమీనుల్.. ధింగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలిచారు. కాగా వివిధ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నట్లుగా వార్తలు వెలువడిన తరుణంలో.. తొలుత అసోంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారి ద్వారా శనివారం నాటికి దాదాపు 25 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 కేసులు నమోదయ్యాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అమీనుల్ ఇస్లాంపై దేశ ద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment