పణజీ/న్యూఢిల్లీ: గోవా, ఢిల్లీలో మొత్తం మూడు స్థానాలకు ఆగస్టు 23న జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో అక్కడ అధికారంలో ఉన్న పార్టీలే విజయం సాధించాయి. గోవా సీఎం, బీజేపీ అభ్యర్థి మనోహర్ పరీకర్ పణజీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 1994 నుంచి పరీకర్ ఈ స్థానంలో గెలుస్తూనే ఉన్నారు. సీఎంగా ఉండగా 2014 నవంబర్‌లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కేంద్రంలో రక్షణ మంత్రి పదవి చేపట్టిన పరీకర్... గత మార్చిలో మళ్లీ రాష్ట్రానికి తిరిగొచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అప్పుడు బీజేపీ నేత సిద్ధార్థ్ కున్సోలియంకర్ పణజీ స్థానం నుంచి గెలవగా, ఇప్పడు పరీకర్ కోసం ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి గిరీష్ చోడంకర్‌పై పరీకర్ 4,803 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విశ్వజిత్ రాణే కూడా గోవాలోని వాల్పోయ్ స్థానం నుంచి గెలిచారు. అటు ఢిల్లీలోని బవానా స్థానంలో ఆప్ అభ్యర్థి రామ్ చందర్ బీజేపీ అభ్యర్థి వేద్ ప్రకాశ్‌పై 24 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2015లో బవానా స్థానంలో ఆప్ నుంచి గెలిచిన వేద్ ప్రకాశ్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉపఎన్నిక జరిగింది.