ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల్లో వెలువడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఢిల్లీ లో ఏర్పడ్డ అనిశ్చితిని తొలగించేందుకు ఎన్నికల కమిషన్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫిబ్రవరి రెండు వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 15వ తేదీ నాటికి ఎన్నికల చీఫ్ కమిషనర్ వీఎస్ సంపత్ కు 65 ఏళ్లు నిండుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సంపత్ చేతుల మీదుగా విడుదల చేసే నోటిఫికేషన్ ఇదే అవుతుంది.
ఇదిలా ఉండగా జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ బీజేపీ నేతలను ఉత్సాహపరిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం పనిచేసింది. ఇదే విధంగా తాము ఢిల్లీ పీటాన్ని దక్కించుకొంటామనే నమ్మకం పార్టీ నాయకత్వంలో బలపడింది. కాగా, 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండవచ్చనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 49 రోజుల తరువాత ఢిల్లీ అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.