న్యూఢిల్లీ: తనను తాను వ్యాపారిగా అభివర్ణించుకున్న ఆమ్ ఆద్మీపార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట నగర వ్యాపారులను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తానని, వ్యాట్ విభాగం బలవంతపు వసూళ్ల ర్యాకెట్‌ను అరికడతానని వాగ్దానం చేశారు. నెహ్రూప్లేస్‌లో సోమవారం జరిగిన వ్యాపారుల ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. వ్యాపారుల కోసం ఆయన వాగ్దానాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తానని చెప్పారు. ఢిల్లీని టోకు వ్యాపార, పంపిణీ కేంద్రంగా మారుస్తానని అన్నారు. ‘‘మై బనియా హూ! దందా సమజ్‌తా హూ’’ (తాను వ్యాపార వర్గం నుంచి వచ్చానని తనకు వ్యాపారం తెలుసు)నని చెప్పారు.
వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసి, పన్నులు కట్టాలని తాము ఆశిస్తున్నామని ఆప్ నేత చెప్పారు. వ్యాపారుల విషయంలో ప్రభుత్వ జోక్యం నామమాత్రంగా ఉంటుందని అన్నారు. దాడులకు పాల్పడటం తమ పార్టీ విధానం కాదని, వ్యాపారులను నమ్మటం తమ విధానమని పేర్కొన్నారు. వ్యాట్ దాడులు, బలవంతపు వసూళ్లను తమ ప్రభుత్వం నిలిపివేస్తుందని, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పారు. తాను పదవి నుంచి దిగిపోయిన వెంటనే వ్యాపారులను వ్యాట్ విభాగం వేధింపులకు గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. తాము వ్యాపారులను వేధింపులకు గురి చేయలేదని, అయినా తమ 49 రోజుల పాలనలో వ్యాట్ వసూళ్లు అత్యధికంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు పన్నుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు.
ఢిల్లీలో వ్యాపారం చేయాలనుకునే వారికి అనుమతులు మంజూరుచేసేందుకు ఏకగవాక్ష (సింగిల్ విండో) వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పన్ను చెల్లింపుల విధానాన్ని కూడా సరళతరం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించేందుకు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌కు మారుస్తామని చెప్పారు. ఇంట్లో నుంచే లెసైన్సులకు దరఖాస్తు చేసి, అక్కడే వాటిని పొందవచ్చని అన్నారు. అవినీతి, అధికారస్వామ్యం కారణంగా వ్యాపారం దెబ్బతింటోందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఏడు రోజుల్లో అనుమతులన్నీ మంజూరు చేస్తామని చెప్పారు. అయినా ఆలస్యమైతే వారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి అనుమతి పొందవచ్చని భరోసానిచ్చారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అతి తక్కువ వ్యాట్ ఢిల్లీలో ఉండగలదని వాగ్దానం చేశారు. వ్యాట్ తగ్గింపు వల్ల ధరలు తగ్గుతాయని, తద్వారా ద్రవ్యోల్బణం తగ్గుతుందని కేజ్రీవాల్ వివరించారు. వ్యాపారుల భాగస్వామ్యం లేకుండా వారికి సంబంధించిన ఎటువంటి విధానాన్నీ రూపొందించబోమని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ని వ్యతిరేకిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లకు మాత్రం తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
మై బనియా హూ!దందా సమజ్‌తా హూ!!
Published Mon, Dec 29 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement