కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో భారతదేశానికి రాష్ట్రపతి కానున్నారా..? దీనికి అవుననే అంటోంది జాతీయ మీడియా.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో భారతదేశానికి రాష్ట్రపతి కానున్నారా..? దీనికి అవుననే అంటోంది జాతీయ మీడియా. ఆదివారం రాజస్థాన్‌లోని భిల్వారాలో ఓ జ్యోతిష్కుడిని తన భర్తతో పాటు వెళ్లి స్మృతి ఇరానీ కలిశారని.. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువరించాయి.
ఇదే జ్యోతిష్కుడు గతంలో కూడా స్మృతి మంత్రి అవుతారని జోస్యం చెప్పారని, అది నిజం కావడంతో మరోసారి ఆయన దర్శనం కోసం స్మృతి వచ్చారని పేర్కొన్నాయి. మీడియాలో వార్తలపై స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ఆమె స్పందిస్తూ.. ‘‘మంత్రిగా నా కార్యక్రమాలపై ప్రశ్నలు అడిగేందుకు మీకు హక్కు ఉంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం నా ఇష్టం. నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించొద్దు’’ అని విలేకరులకు సూచించారు.