సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టినందుకో, మరెందుకోగానీ కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలోని ‘వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ’ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పేదల పెన్నిదిగా ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతోంది. 2010లో అప్పటి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇది వేలాదిమంది పేద ప్రజలకు ప్రాణభిక్ష పెట్టింది. కర్ణాటక పేద ప్రజలను ఎక్కువగా పీడిస్తున్న క్యాన్సర్, గుండె జబ్బుల వైద్యం కోసం ఇల్లూ వాకిలి అమ్ముకునే పరిస్థితి నుంచి వారిని కాపాడుతూ వస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) పేద ప్రజలందరికి ఈ స్కీమ్ కింద ఉచితంగా వైద్య సేవలు బేషుగ్గా అందుతున్నాయి. అంటే బీపీఎల్ కార్డులున్న వారందరికి ఈ ఆరోగ్య శ్రీ కార్డులను అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆరోగ్య ట్రస్టు పరిధిలో నడుస్తున్న ఈ పథకాన్ని ప్రశంసిస్తూ ‘బీఎంజే గ్లోబల్ హెల్త్’ గతేడాదే ఓ నివేదికను విడుదల చేసింది. ఈ స్కీమ్ లేనివారితో పోలిస్తే ఈ స్కీమ్ కలిగిన వారు 40 శాతానికిపైగా ఆస్పత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ స్కీమ్ లేకుండా తీవ్రమైన జబ్బులకు గురైన వారి సంఖ్యతో పోలిస్తే వారిలో ఈ స్కీమ్ లబ్ధిదారులు 35 శాతానికన్నా తక్కువగా ఉన్నారు. అంటే, స్కీమ్ లబ్ధిదారులు ప్రాథమిక దశలోనే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం వల్ల వారిలో ఎక్కువ మంది తీవ్రమైన జబ్బుల బారిన పడలేదు. స్కీమ్ పరిధిలోకి రానివారిలో క్యాన్సర్, గుండె జబ్బుల కారణంగా 0.90 శాతం మరణిస్తే ఈ స్కీమ్ లబ్ధిదారుల్లో 0.30 శాతం మంది మాత్రమే మరణించారు.
స్కీమ్ పరిధిలోకి రానివారు ఆస్పత్రుల్లో చేరాక ఇన్ఫెక్షన్లు వచ్చిన వారిలో ఈ స్కీమ్ లబ్ధిదారులు 88 శాతం మంది తక్కువగా ఉన్నారు. అంటే, స్కీమ్ పరిధిలో లేని వారికి నూటికి నూరు శాతం ఇన్‌ఫెక్షన్లు వచ్చాయనుకుంటే స్కీమ్ లబ్ధిదారుల్లో 12 శాతం మందికే ఇన్‌ఫెక్షన్లు వచ్చాయన్నమాట. వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ పథకం కేసుల్లో 86.7 శాతం కేసులు సముచితమైనవి కాగా, 3.7 శాతం కేసులు మాత్రమే అనుమానాస్పదమైనవని బీఎంజే గ్లోబల్ హెల్త్ తన నివేదికలో వెల్లడించింది. ఈ స్కీమ్ కింద సాధారణంగా ఏడాదికి లక్షన్నర రూపాయలను, కొన్ని అసాధరణ కేసుల్లో రెండు లక్షల రూపాయలను బీమాగా ఖర్చు పెడుతున్నారు. రోగులు తమ ఇంటి నుంచి, తమ ఊరు నుంచి ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా ట్రస్టు భరిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలం స్థాయిలోనే కాకుండా ట్రస్టు సూచించిన పట్టణం లేదా గ్రామంలో ప్రతివారం నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆరోగ్యాలను సమీక్షిస్తున్నాయి.
ఈ స్కీమ్ ఇంతగా విజయం సాధించడానికి కారణం ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించకుండా ప్రభుత్వ ట్రస్టు ఆధ్వర్యంలో నడవడమేనని పలు పరిశోధనా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమలు చేయనున్న ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా పథకం అమలును ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించాలా? లేదా స్వచ్ఛంద సంస్థల ట్రస్టులకు అప్పగించాలా? అని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. వాజ్‌పేయి ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్న ప్రభుత్వ ట్రస్టును ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో!
Comments
Please login to add a commentAdd a comment