దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను దేశంలోని అన్ని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తామని బీజేపీ తెలిపింది. ఆదివారం హరిద్వార్‌లోని గంగానది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. హరిద్వార్‌లో జరిగే వాజ్‌పేయి అస్థికల నిమజ్జన కార్యక్రమానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో వాజ్‌పేయి సంస్మరణ సభను నిర్వహిస్తామని యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీతో పాటు వేర్వేరు పార్టీల నేతలు, ప్రముఖులు హాజరవుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆగస్టు 23న నిర్వహించే మరో సంస్మరణ సభకు వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటా రన్నారు. వాజ్‌పేయి అస్థికలను లక్నోలో ని గోమతి నదిలోనూ కలుపుతామన్నారు.
వాజ్‌పేయి అస్థికలను దేశంలోని అన్ని నదుల్లోనూ కలపడంతో పాటు ఆయన అస్థి కలశాన్ని అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాలకు తీసుకెళ్తామన్నారు. అన్ని పంచాయతీ, జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో సంతాప సమావేశాలు నిర్వహిస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమవుతున్న కేరళకు ఆయన సంఘీభావం తెలిపారు. కేరళ వాసులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, ఆహారం, ఇతర వస్తువులను సేకరిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్ రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment