ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్ మెడల్స్ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన.
ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్‌ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్‌కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్‌కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్‌ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు.
ఈ క్రమంలో గంగలో మెడల్స్‌ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్‌పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment