
మదురైలో హైదరాబాదీలపై దాడి
తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న ఓ ఆలయంలో అర్ధరాత్రి దోష నివారణ పూజలు చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది హైదరాబాద్‌వాసులను (దిల్‌సుఖ్‌నగర్‌కు చెందినవారు) దొంగలుగా పొరబడి స్థానికులు కర్రలతో దాడి చేశారు.
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న ఓ ఆలయంలో అర్ధరాత్రి దోష నివారణ పూజలు చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది హైదరాబాద్‌వాసులను (దిల్‌సుఖ్‌నగర్‌కు చెందినవారు) దొంగలుగా పొరబడి స్థానికులు కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న మేలూరు పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను మదురై జీహెచ్‌కు తరలించారు. దాడికి పాల్పడిన మూడు గ్రామాలకు చెందిన 55 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం త్రిటా కేశవ్ (40), ఆయన భార్య సుధామ(35), కుమారుడు రేవంత్ (14), తల్లి, బంధువులు వేణు(31), ప్రేమ్‌కుమార్ (38), శ్రీరాములు (35), రాజు (30), రామచంద్ర ప్రసాద్ (32), స్వామి (31), వెంకటాచారి (38) ఇన్నోవా కారులో ఆదివారం కుంభకోణంలోని ఓ ఆలయంలో దర్శనం చేసుకొని ఆపై సమీపంలోని వైదీశ్వరన్ స్వామి ఆలయానికి వెళ్లారు.
అక్కడి జ్యోతిష్కుని వద్ద కేశవ్ జాతకం చూపించుకోగా అందులో దోషం ఉందని...దాని నివారణకు మదురై జిల్లాలోని అళగర్ మలై కొండ దిగువనున్న వెల్లిమలై మురుగన్ ఆలయంలో పౌర్ణమి రోజు అర్ధరాత్రి దోష నివారణ పూజలు చేయాలని సూచించాడు. దీంతో కేశవ్ 20న మురుగన్ ఆలయానికి చేరుకొని సమీప గ్రామస్తులకు అన్నదానం చేశారు. ఆపై కేశవ్ తన తల్లి, భార్యను మదురైకి పంపించి తొమ్మిది మంది పురుషులు మాత్రం అక్కడే ఉండి మంగళవారం అర్ధరాత్రి ఆ ఆలయంలో పూజలు మొదలుపెట్టారు. అయితే వారిని దొంగలముఠాగా పొరబడిన స్థానికులు 9 మందిని కొట్టి వాహనాన్ని ధ్వంసం చేశారు.