
ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
309 సెక్షన్ తొలగించాలని కేంద్రం నిర్ణయం
లా కమిషన్ సిఫారసుకు 18 రాష్ట్రాలు అనుకూలం
న్యూఢిల్లీ: ఆత్మహత్యాయత్నం ఇకపై నేరం కాబోదు. ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ చేసిన సిఫార్సుపై దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సానుకూలంగా స్పందించాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది. ఇది త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశముందని తెలిపింది. ఈ అంశంపై ఒక సభ్యుడి ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 309వ సెక్షన్‌ను రద్దు చేయాలని లా కమిషన్ తమ 210వ నివేదికలో సిఫారసు చేసింది. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున దీనిపై వారి అభిప్రాయం కోరాం. 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే 309వ సెక్షన్‌ను రద్దుచేసే అవకాశముంది..’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
అయితే ఈ సెక్షన్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదనను పలు రాష్ట్రాలు వ్యతిరేకించగా.. మరికొన్ని పలు సూచనలు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయకుండా, కొన్ని సవరణలు మాత్రం చేయాలని బిహార్ డిమాండ్ చేసింది. ఎవరైనా తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారు ఆత్మహత్యాయత్నం చేస్తే.. దానికి సంబంధించి వేరే చట్టాలు ఉండాలని సూచించింది. ఇక ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకపోతే... సెక్షన్ 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం)ను బలహీన పరుస్తుందని మధ్యప్రదేశ్ స్పష్టం చేసింది. సిక్కిం కూడా లా కమిషన్ సిఫారసు పట్ల వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక 309 సెక్షన్‌ను రద్దుచేయడం పట్ల ఢిల్లీ సానుకూలంగానే స్పందించినా... సదరు ఆత్మహత్యాయత్నం ఘటనలను సంబంధిత అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువచ్చేలా, వారికి ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించింది.