బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఔరంగాబాద్ : మహారాష్ట్రాలోని ఔరంగాబాద్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి బాణాసంచా దుకాణాల్లో మంటలు రేగాయి. ఔరంగాబాద్‌లోని జడ్పీ మైదాన్‌లో దీపావళి సందర్భంగా బాణాసంచా స్టాల్స్ ఏర్పాటు చేశారు. పండుగకు వారం రోజుల ముందు నుంచి వ్యాపారులు ఈ స్టాల్స్ తెరుస్తారు. పెద్దఎత్తున బాణా సంచాను అదే మైదానంలో నిల్వ చేస్తారు. దీపావళి రెండు, మూడు రోజులు ఉందనగా వ్యాపారం ఊపందుకుంటుంది. అయితే ఇవాళ ఉదయం ఓ దుకాణంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లో మొత్తం స్టాల్స్‌కు వ్యాపించడంతో, వ్యాపారులు ప్రాణాలు దక్కించుకోవడం మినహా.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితి నెలకొంది. జడ్పీ మైదానంలో పార్కింగ్‌లో ఉంచిన కార్లు, ఆటోలు, బైక్‌లు ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. కోట్ల రూపాయలు విలువ చేసే బాణాసంచా అగ్నికి ఆహుతైంది. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.