న్యూఢిల్లీ : తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్ జైలు లోపల మొబైల్ సిగ్నల్స్‌ను నిరోధించలేకపోతున్నామని అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్స్‌ను నిరోధించడం సాధ్యం కావడం లేదని.. ఇందుకోసం ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోటోటైప్ జామర్‌ను అభివృద్ధి చేయాల్సిందిగా సీ-డాట్‌ను కోరినట్టు కోర్టుకు వివరించారు. వివరాల్లోకి వెళితే.. తీహార్ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషి 2018లో ఢిల్లీ హైకోర్టుకు లేఖ రాశారు. ‘జైలు అధికారులు డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా మొబైల్ ఫోన్స్, ఇతర నిషేధిత వస్తువులు అందజేస్తున్నారు. జైల్లో ఖైదీలను జంతువుల మాదిరిగా చూస్తున్నారు’ అని ఆ వ్యక్తి ఆరోపించారు.
దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు అందులో నిజానిజాలు తేల్చాల్సిందిగా ఓ జడ్జిని నియమించింది. జైల్లో పరిస్థితుల మీద విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో విచారణ జరిపిన జడ్జి.. 2019 ఏప్రిల్‌లో తన రిపోర్ట్‌ను కోర్టుకు అందజేశారు. లేఖలో ఆరోపించిన విధంగానే జైలు లోపల నిషేధిత వస్తువులు ఉన్నాయని తెలిపారు. జైలు అధికారులు డబ్బులు తీసుకుని ఖైదీలకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిలీ ప్రభుత్వం తరఫున వాదనలు రాహుల్ మెహ్రా వాదనలు వినిపించారు. జైల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని.. అలాగే శాఖ పరమైన విచారణకు కూడా ఆదేశించామని రాహుల్ కోర్టుకు తెలిపారు. అలాగే జైలు లోపల 5 వేల సీసీటీవీ కెమెరాలు, 50 బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జైలులోకి ప్రవేశించేవారిని పూర్తి స్థాయిలో పరీక్షించడానికి బాడీ స్కానర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. అయితే ఈ చర్యలపై స్పందించిన న్యాయస్థానం.. కేవలం ఖైదీలను పర్యవేక్షించడానికే మాత్రమే కాకుండా అధికారుల రూమ్‌ల్లో కూడా ఈ రకమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
దీనిపై రాహుల్ స్పందింస్తూ కోర్టు సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. అలాగే ఈసీఐఎల్ అందజేసిన జామర్ల ద్వారా మొబైల్ సిగ్నల్స్‌ను నిరోధించడానికి ప్రయత్నించినట్టు రాహుల్ కోర్టుకు తెలిపారు. అయితే వాటి ద్వారా ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్‌ను బ్లాక్ చేయలేకపోయామని అన్నారు. జైలు లోపల మొబైల్ ఫోన్‌ల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. జైలు పరిసరాల్లో మొబైల్ సిగ్నల్స్‌ను నిరోధించేలా ప్రత్యేక ప్రోటోటైప్ జామర్‌ను తయారు చేయాలని సీడాట్‌ను కోరినట్టు కోర్టుకు వివరించారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment