అవార్డు వాపసీపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు, సినీ ప్రముఖులు తమ అవార్డులను వాపస్ ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు లభిస్తాయని, వాటితో గౌరవంగా స్వీకరించాలని ప్రణబ్ పేర్కొన్నారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. 'కొన్నిసార్లు సున్నిత మనస్కులు సమాజంలోని కొన్ని ఘటనలు చూసి ఆందోళనకు గురవుతారు. అయినప్పటికీ భావోద్వేగాలు హేతుబద్ధతను అధిగమించరాదు' అని పేర్కొన్నారు.
అసహనం, అవార్డు వాపసీ వివాదాలపై పరోక్షంగా పేర్కొంటూ 'అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయాలి' అని సూచించారు. సమయం వచ్చినప్పుడల్లా ఆత్మపరిశోధన చేసుకొని తన తప్పులను తాను సరిదిద్దుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రణబ్ అన్నారు. '21వ శతాబ్దంలో శక్తిమంతమైన, వైభవోజ్వలమైన భారత్ కోసం స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నరు. ప్రజాప్రయోజనాలు రక్షించడంలో, అట్టడుగు వర్గాలకు అండగా నిలువడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.