మోదీ సర్కారుపై అమెరికా 'మతం' బాంబు
న్యూఢిల్లీ: పైకి స్నేహం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆ దేశాధ్యక్షుడు 'చాయ్ పే చర్చ'ల్లో చిరునవ్వులు చిందించనప్పటికీ ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకున్న వ్యతిరేకతను అమెరికా మరోసారి బాహాటంగా ప్రకటించింది. యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం నేతృత్వంలోని స్వతంత్ర సంస్థ యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్ సీఐఆర్ఎఫ్) తన వార్షిక నివేదికలో మోదీ సర్కారుపై 'మతం' బాంబులు కురిపించింది. సోమవారం విడుదలైన ఈ వార్షిక నివేదికలో సంచలనాత్మక ఆరోపణలు చేసింది.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో అసహనం పెరిగిపోయిందని, మైనారిటీ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయని యూఎస్ సీఐఆర్ఎఫ్ ఆరోపించింది. 2015 నుంచి ఇండియాలో పరమతసహనం క్షీణిస్తున్నదని, మతస్వేచ్ఛపై నిర్భ్యంతరంగా దాడులు జరుగుతున్నాయన్న నివేదిక.. అధికార బీజేపీ ముఖ్యనేతల అండతో కొందరు బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మైనారిటీలపై దాడులను ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల(జూన్ లో) వాషింగ్టన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ సీఐఆర్ఎఫ్ నివేదిక ఈ రకమైన అంశాలు వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
యూఎస్ సీఐఆర్ఎప్ భారత అంతర్గత వ్యవస్థలపైనా తీవ్ర నిందారోపణలు చేసింది. మైనారిటీలపై దాడులకు పాల్పడేవారిని నిరోధించడంలో పోలీసులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని, అవసరానికి తగ్గ సిబ్బంది న్యాయవ్యవస్థకు లేకపోవడం కూడా అసహనం పెరుగుదలకు మరో కారణమని తెలిపింది. అంతేకాదు.. భారత్ తో ద్వైపాక్షిక చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది. భారత్ తో చర్చల్లో మతసహనం అంశాన్ని కూడా చేర్చి, ఆ దేశంలో (ఇండియాలో)ఇప్పుడున్న పరిస్థితిలో మార్పునకు కృషిచేయాలని సలహాఇచ్చింది.
అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (1998) ఆధారంగా ఏర్పాటుచేసిన యూనైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్ సీఐఆర్ఎఫ్) దేశదేశాల్లో మతసహన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివేదికలు, సలహాలు ఇస్తుంది. యూఎస్ సీఐఆర్ఎఫ్ అధ్యక్షుడు, సభ్యులను అమెరికా అధ్యక్షుడు, సెనెట్ సభ్యులు ఎంపిక చేస్తారు. పేరుకు స్వతంత్ర సంస్థే అయినప్పటికీ ఇందులో ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తూఉంటారు. ఫెడరల్ ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది.