బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం
సీఎం నితీశ్‌కుమార్ ప్రకటన
పట్నా: బిహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి వచ్చింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్) సహా రాష్ట్రంలో మద్యం(ఆల్కహాల్) విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం మంగళవారం పూర్తి నిషేధాన్ని విధించింది. మంత్రివర్గ సమావేశానంతరం ముఖ్యమంత్రి నితీశ్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఇది తక్షణం అమలులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. బార్లు, రెస్టారెంట్లతోసహా రాష్ట్రంలో ఎక్కడా ఆల్కహాల్‌ను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయ మద్యం విక్రయాలు, వినియోగంపై ఏప్రిల్ ఒకటి నుంచి బిహార్ ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పట్నా, ఇతర పట్టణాల్లోనూ మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రత్యేకించి మహిళలు, చిన్నారుల్లో బ్రహ్మాండమైన స్పందన రావడంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం వచ్చినట్టు సీఎం వివరించారు. పట్టణాలు, నగరాల్లోని హోటళ్లు, క్లబ్బులు, బార్ల వంటి ప్రదేశాల్లో మద్యం విక్రయాలకు లెసైన్సులు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కానీ ఆర్మీకి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.