'లైట్లు ఆపేస్తే అదే ఫీల్ వస్తుంది'
న్యూఢిల్లీ: మద్యపానం నిషేధం విధించిన తర్వాత తనకు కలిగినంత ఆత్మసంతృప్తి మరెప్పుడూ కలగలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మద్యం పాన అలవాటు మానుకోలేకపోతున్న మందుబాబులకు ఆయన కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. జ్యూస్ అలవాటు చేసుకోవడం ద్వారా మద్యాన్ని మానేయొచ్చని చెప్పారు. ఇంట్లో లైట్లు ఆపేసి చీకట్లో పళ్ల రసం తాగడం ద్వారా మద్యంతాగినంత అనుభూతి పొందవచ్చని, దాని ద్వారా ఆ మహమ్మారికి దూరం జరగవచ్చిన చెప్పారు.
తొలుత పాక్షికంగా మద్యంపై నిషేదం విధించిన సీఎం నితీశ్ కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమలుకు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించేలా ప్రొహిబిషన్ చట్టం తెచ్చారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలకు దిగినా వారిపై బిహార్లో దాడులు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మద్యంపై నిషేదం విధించడం ద్వారా జేడీయూకు మంచి పేరు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రతిచోట ఈ విషయంపై స్పందిస్తున్నారు. మద్యం విషయంలో నిబంధనలు అతిక్రమించినవారికి బెయిల్ కూడా లభించకుండా చట్టంలో చేర్చారు.