సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ జోక్యంతో మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ ఎట్టకేలకు అలకపాన్పు నుంచి దిగివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కృష్ణ ఇంటికి దిగ్విజయ్ గురువారం పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరను వెంటపెట్టుకుని వెళ్లారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ వద్ద కృష్ణ తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు సమాచారం. మంత్రివర్గం కూర్పులో తన మాటకు విలువ ఇవ్వలేదని, ఎన్నికల సమయంలో తన సేవలను వినియోగించుకోవడం, ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయిందని నిష్టూరాలాడినట్లు తెలిసింది. అయితే, దిగ్విజయ్ నచ్చజెప్పడంతో కృష్ణ శాంతించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.