సాక్షి, నరసరావుపేట: నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మే పచ్చ పత్రిక ఈనాడులో బుధవారం ప్రచురితమైన ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ వార్త పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాసిందే. అందులో పల్నాడు జిల్లా అమరావతి మండల న్యూస్‌టుడే విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేశారని, చంపబోయారంటూ కట్టుకథలు అల్లారు. వాస్తవానికి ఆ విలేకరి సంఘ విద్రోహశక్తిగా పేరున్న టీడీపీ నేత దండా నాగేంద్రతో సాన్నిహిత్యంగా ఉంటూ అతని కనుసన్నల్లో ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు.
నాగేంద్ర పీడీ యాక్ట్‌పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు ఆ టీడీపీ నేత గత కొన్ని నెలలుగా కుట్రలు చేస్తున్నాడు. పరమేశ్వరరావు ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో అతన్ని తొలగించారు. ఈ క్రమంలో అతనికి ఏడాది క్రితం నాగేంద్ర సిఫార్సుతో ఈనాడు విలేకరిగా అవకాశం కల్పించారు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు.
దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరింపులు..
ఈ నెల 13న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్వయంగా మల్లాది ఇసుక రీచ్‌కు వచ్చి పరిశీలించివెళ్లారు.ఇసుక తవ్వకాలు ఆపమని జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో మరుసటి రోజు యథావిధిగా ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామస్థాయి అధికారులు వచ్చి వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని నిర్వాహకులకు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడ్ చేయటానికి బిల్లులు రాశారు. బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనుకకు పంపారు.
బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలు బయటకు వెళ్లాయి. ఈ సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుకరీచ్‌లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో రీచ్‌లో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో ఏంటబ్బాయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నావని అడగగా.. నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తానంటూ దురుసుగా మాట్లాడాడు.
అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈనాడు విలేకరి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉçన్న ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి విలేకరిని ద్విచక్రవాహనంపై దగ్గరుండి పంపించారు. కిందపడ్డ పరమేశ్వరరావు సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం తీసుకు వచ్చి అతనికి అప్పగించారు. సంఘటన జరిగిన తరువాత విజిలెన్స్ అధికారి మీడియాకు ఈ విషయాన్ని వివరించారు.
వాస్తవాలు దాచిపెట్టి ఈనాడు కథనం
సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే జరిగింది ఒకటైతే ఈనాడు పత్రికలో వచ్చింది మాత్రం మరొకటని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారితో వాగ్వివాదానికి దిగాడన్నారు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తోపులాట జరిగిందన్నారు. అంతేగాని పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం వంటి మాటలు అనటం, దాడి చేసి నిర్బంధించినట్లు రాయడం అవాస్తవమన్నారు.
ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్ సీపీ, ఎమ్మెల్యే శంకరరావు పేరు ప్రస్తావించలేదని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, దీనికి రాజకీయ రంగు పులిమారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో పరమేశ్వరరావు గుంటూరు ఈనాడు కార్యాలయానికి చేరి.. అక్కడ అల్లిన కట్టుకథే ఈనాడులో ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment