బెంగళూరు వీధుల్లో రణరంగం
బెంగళూరు: బెంగళూరులో పలు రోడ్లు రణరంగాన్ని తలపించాయి. రోడ్ల కూడళ్లు పెనుగులాటల చోట్లుగా కనిపించాయి. పోలీసులు లాఠీలు ఝులిపించగా కార్మికులు రాళ్లు విసిరారు. దాదాపు కొన్నిగంటలపాటు వారి మధ్య ఈ ఘర్షణ కొనసాగింది. పైగా మండే ఎండలు కావడంతో అటు పోలీసులు, కార్మికులు కొందరు పిట్టల్లా కూలిపోయారు. అయినప్పటికీ ఘర్షణ మాత్రం అలాగే కొనసాగింది. పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెలిక పెడుతూ ప్రకటన చేయడంతో బెంగళూరులోని కార్మికులంతా రోడ్లెక్కారు. వీరిలో గార్మెంట్ వర్కర్లే అధికంగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. పలు ప్రధాన రహదారులను దిగ్బందించారు. కూడళ్ల వద్ద గుంపులుగా చేరుకుని మానవహారాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆందోళన ఉధృతంగా మారింది. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. బస్సులను తగులబెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో లాఠీలు తీసిన పోలీసులు దొరికిన వారిని దొరికినట్లుగా గొడ్డును బాదినట్లు బాదారు. మండుటెండలు, ఆందోళన నడుమ బెంగళూరు నగరం ఒక ఉడుకు ఉడికింది.