పీఎఫ్ పై కార్మిక యుద్ధం
పీఎఫ్ పై కార్మిక యుద్ధం
Published Wed, Apr 20 2016 2:42 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM
ఆందోళనలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
పీఎఫ్ ఉపసంహరణపై కొత్త నిబంధనలు రద్దు
బెంగళూరులో వస్త్ర కార్మికుల ఆందోళన హింసాత్మకం
హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌కు, మూడు ఆర్టీసీ బస్సులకు నిప్పు
70 బస్సులు, పెద్ద సంఖ్యలో ఇతర వాహనాలు ధ్వంసం
పోలీసులపైనా దాడి చేసిన ఆందోళనకారులు
లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం
చివరికి కాల్పులు జరిపిన పోలీసులు.. ఇద్దరికి గాయాలు
పలు ఘటనల్లో 25 మంది పోలీసులు,
100 మందికిపైగా ఆందోళనకారులకు గాయాలు
న్యూఢిల్లీ/బెంగళూరు/సాక్షి, హైదరాబాద్
పీఎఫ్ ఉపసంహరణను కఠినతరం చేస్తూ తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో ఆ నిబంధనలను రద్దు చేసింది. పీఎఫ్ ఉపసంహరణపై కొత్త నిబంధనలకు సంబంధించిన (ఫిబ్రవరి 10 నాటి) నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో ప్రకటించారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇక ముందు పాత నిబంధనలే అమల్లో ఉంటాయని చెప్పారు. భవిష్యనిధి విషయంలో యాజమాన్య కోటాలోని 3.67 శాతంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అంశంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తొలుత కొత్త నిబంధనల అమలును జూలై 31వ తేదీ వరకు వాయిదా వేస్తున్నామని.. అప్పటిదాకా ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయని దత్తాత్రేయ ప్రకటించారు. దీనిపై భాగస్వాములు, కార్మిక సంఘాలతో చర్చిస్తామని.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చేలా సవరణ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ సాయంత్రం దత్తాత్రేయ మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించారు. వివాదాస్పద నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్మికులకు అండగా ఉంటామని, ఎలాంటి అన్యాయం జరగనీయబోమని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు.
ఈపీఎఫ్‌వో చందాదారులు తమ పీఎఫ్ సొమ్ములో కొంత భాగాన్ని 58 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉపసంహరించుకోకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. తద్వారా యాజమాన్యం వాటా నుంచి పీఎఫ్‌కు జమయ్యే 3.67 శాతం నిధులను ఉపసంహరించడానికి వీలు లేకుండా చేసింది. దీనిని ఫిబ్రవరి 10వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కానీ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో.. అమలు తేదీని ఏప్రిల్ 30కి మార్చింది. తాజాగా పూర్తిగా వెనక్కి తీసుకుంది. ఉపసంహరించుకునే పీఎఫ్ నిధుల్లో కొంత మొత్తంపై బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదన చేయడం, దానిపై నిరసన రావడంతో కేంద్రం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.
ఆందోళన హింసాత్మకం
పీఎఫ్ ఉపసంహరణను కఠినతరం చేసే నిబంధనలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశాయి. బెంగళూరులోని వస్త్ర పరిశ్రమ కార్మికులు సోమవారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన రెండో రోజు మంగళవారం హింసాత్మకంగా మారింది. వాహనాల దహనం, రాళ్లు రువ్వడంద్వారా ఆందోళనకారులు విజృంభించగా.. పోలీసులు లాఠీచార్జి చేసి టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనల్లో 25 మంది పోలీసులతో పాటు 100 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తుమకూరు రోడ్డు, హెబ్బగోడి, పిణ్యా తదితర ప్రాంతాలతో పాటు బెంగళూరు నలుగుదిక్కులా ఉన్న వస్త్ర పరిశ్రమ కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించి రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేశారు. అక్కడి పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
మరికొంత మంది స్టేషన్‌లోకి చొచ్చుకుపోయి పోలీసులపై భౌతికదాడికి పాల్పడడంతో ఏసీపీ ఓబులేసు, ఎస్సై గిరీశ్‌తో పాటు తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ రోడ్డుపై వెళుతున్న ప్రీతి అనే డిగ్రీ విద్యార్థి, ఓ కొరియర్ కార్యాలయంలో పనిచేస్తున్న మంజునాథ్ గాయపడ్డారు. ఇక నగరవ్యాప్తంగా ఆందోళనకారులు చెలరేగిపోయారు. మూడు ఆర్టీసీ బస్సులను దహనం చేశారు. మరో 70 బస్సులు, 10 పోలీసు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. వస్త్ర కార్మికులతోపాటు ఇతర కార్మికులూ ఆందోళనలోకి చేరారని.. బెంగళూరులోని మరికొన్ని ప్రాంతాల్లోనూ బస్సులు, వాహనాలపై రాళ్లు రువ్వినట్లు పోలీస్ కమిషనర్ ఎన్‌ఎస్ మేఘారిక్ తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రుల్లో చేర్చామని చెప్పారు.
ఈపీఎఫ్ నిబంధనలు-సవరణలు
1. ఈపీఎఫ్ సభ్యులు 60 రోజులు ఉద్యోగం లేకుండా ఉంటే తమ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు.
సవరణ: రిటైర్మెంట్ వయసు వచ్చేదాకా మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకోవటం కుదరదు. ఒకవేళ ఉద్యోగం పోయిన పక్షంలో ఉద్యోగి తన వాటాగా చెల్లించిన మొత్తాన్ని, వడ్డీని మాత్రమే వెనక్కి పొందగలడు. యాజమాన్యం వాటాగా చెల్లించిన మొత్తాన్ని రిటైర్మెంట్ వయసు వచ్చాకే తీసుకునే వీలుంటుంది.
2. ఉద్యోగానికి రాజీనామా చేసి పీఎఫ్ సొమ్ము తీసేసుకున్న పక్షంలో ఈపీఎఫ్ సభ్యత్వం రద్దయిపోతుంది.
సవరణ: ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత కూడా ఉద్యోగి తన వాటా మాత్రమే తీసుకోగలడు. యజమాని చెల్లించిన వాటా రిటైర్మెంట్ వయసు వచ్చేదాకా అందులోనే ఉంటుంది. దీంతో అప్పటిదాకా ఈపీఎఫ్ సభ్యత్వం కొనసాగుతుంది.
3. రిటైర్మెంట్ వయసు 55 ఏళ్లుగా పరిగణిస్తున్నారు.
సవరణ: దీన్ని 55 నుంచి 58 ఏళ్లకు పెంచారు.
4. రిటైర్మెంట్‌కు ఏడాది ముందు.. అంటే 54 ఏళ్ల వయసులో పీఎఫ్ మొత్తంలో (ఉద్యోగి+యజమాని వాటా) 90 శాతాన్ని తీసేసుకునే అవకాశముంది.
సవరణ: రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లకు పెంచడం వల్ల ఈ అవకాశం 57 ఏళ్లు వచ్చాక మాత్రమే వస్తుంది.
(ఈ సవరణలన్నింటినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది)
Advertisement