పీఎఫ్పై వెనక్కి తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: పీఎఫ్ ఉపసంహరణ కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బెంగళూరులో భారీ స్థాయిలో కార్మికులు ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో కేంద్రం దిగొచ్చింది. పీఎఎఫ్ ఉపసంహరణపై కొత్త నిబంధనల అమలు అంశాన్ని జూలై 31 వరకు వాయిదా వేసింది.
పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెలిక పెడుతూ ప్రకటన చేయడంతో బెంగళూరులోని కార్మికులంతా రోడ్లెక్కారు. వీరిలో గార్మెంట్ వర్కర్లే అధికంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. పలు ప్రధాన రహదారులను దిగ్బందించారు. కూడళ్ల వద్ద గుంపులుగా చేరుకుని మానవహారాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆందోళన ఉధృతంగా మారింది. హింసాత్మక రూపం దాల్చింది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది.