ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు చికిత్స చేసే హెల్త్‌వర్కర్లు విధిగా పర్సనల్ ప్రొటెక్టివ్ గేర్లు ఉపయోగిస్తున్నారు. మరి ఒకవేళ అలాంటి మాస్కులు, పీపీఈలపైనే వైరస్ ఉంటే?.. వస్త్రంపై ఏడు రోజుల పాటు బతకగలిగే వైరస్ వారికి హాని చేయకుండా ఉంటుందా? ఇలాంటి సమస్యకు తమ వద్ద పరిష్కారం ఉందంటున్నారు బెంగళూరు శాస్త్రవేత్తలు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సరికొత్త ఆవిష్కరణతో ముందుకువచ్చారు. దుస్తులు, రక్షణ పరికరాలు, గౌన్లు, ఇతర ఉపరితలాలపై కరోనా అంటుకోకుండా ఉండేందుకు టెక్స్‌టైల్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ రసాయన పూతలో క్రిమి సంహారక అణువులను ఉపయోగించడం ద్వారా హెల్త్ వర్కర్లను కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.(కరోనాకు కొత్త రకం వ్యాక్సిన్)
క్వాటర్నరీ అమ్మోనియం లవణాల రసాయన మిశ్రమంతో ల్యాబ్‌లో ఈ మేరకు చేసిన పరిశోధనలు సత్పలితాలు ఇచ్చాయని... అధిక సంఖ్యలో టెక్స్‌టైల్ కోటింగ్ ఉత్పత్తి చేసేందుకు పలు కంపెనీలతో మాట్లాడామని పరిశోధకులు వెల్లడించారు. ఏదైనా వస్త్రంపై ఈ క్రిమిసంహారక కోటింగ్ వేసినట్లయితే... దానిపై పడిన బాక్టీరియా లేదా వైరస్‌ను న్యూట్రలైజ్ చేసి.. లోపలికి రాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కరోనా సోకిన వారికి ఈ కోటింగ్ ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదని... ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే దీనిని ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్త్‌వర్కర్లు, పారిశుద్య కార్మికులు వైరస్ బారిన పడకుండా టెక్స్‌టైల్ కోటింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.(మాస్క్ ధరించడం ‘బలహీనతకు సంకేతం’!)
ఇక ఈ విషయం గురించి ఇన్‌స్టెమ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఈ కోటింగ్‌ను రెండు విధాలుగా వినియోగించవచ్చన్నారు. ‘‘ద్రావణ రూపంలో ఉన్న కోటింగ్‌ను దుస్తులు, మాస్కులు, కోట్లపై వేసి వేడి చేయడం ద్వారా దానిని క్లాత్‌కు అంటుకునేలా చేయవచ్చు. రెండోది... దుస్తుల తయారీ సమయంలోనే ఈ మిశ్రమాన్ని దానికి అంటించడం. ఒకసారి ఈ పూతను వేస్తే దాదాపు 25 ఉతుకుల వరకు ప్రభావం చూపిస్తుంది’’అని పేర్కొన్నారు. అయితే ఈ కెమికల్ చర్మంపై పడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అధ్యయనం చేస్తున్నామని... ఆయింట్‌మెంట్‌లా దీనిని ఉపయోగించలేమని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి పరిశోధనలు చేసిన తర్వాతే దీని గురించిన అధికారిక ప్రకటన చేస్తామని ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. పీపీఈ కిట్ల నాణ్యతను పెంచేందుకు దీన్ని రూపొందించామని, మరో నాలుగు నెలల్లో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 'కరోనా అని ఇంట్లోనే కూర్చుంటే లాభం లేదు'
Comments
Please login to add a commentAdd a comment