
రావణ దిష్టిబొమ్మలను తగులబెడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని హెచ్చరించిన భీమ్ ఆర్మీ..
సాక్షి, ముంబై : దసరా సందర్భంగా రావణ దహనాన్ని నిషేధించాలని దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీ డిమాండ్ చేసింది. రావణ దిష్టిబొమ్మల దహనం నిషేధించాలని కోరుతూ ఈ సంస్థ పూణే పోలీసులకు లేఖ రాసింది. దసరా వేడుకల నేపథ్యంలో రావణ దిష్టిబొమ్మల దగ్ధానికి పాల్పడిన వారిపై ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరింది.
మానవతా సంస్కృతికి రావణుడు చిహ్నమని, అందుకే పలు ఆదివాసీ వర్గాలకు ఆయన పూజ్యనీయుడని పేర్కొంది. రావణుడు న్యాయం, సమానత్వం పట్ల విశ్వాసం కలిగిన రాజని భీమ్ ఆర్మీ కొనియాడింది. రావణుడిని వేల సంవత్సరాలుగా చరిత్ర వక్రీకరించిందని, ఆయనను దుర్మార్గుడిగా చూపిందని పోలీసులకు ఇచ్చిన లేఖలో సంస్థ పేర్కొంది.
రావణ దహనంపై నిషేధం విధించడంలో పోలీసులు విఫలమైతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని హెచ్చరించింది. భీమ్ ఆర్మీతో పాటు మహారాష్ట్రలోని ఇతర ఆదివాసీ సంస్థలు రావణ దహనాన్ని వ్యతిరేకించాయి.