సాక్షి, చెన్నై: ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో ఇక సెల్‌ఫోన్‌పై నిషేధం అమల్లోకి రానుంది. విద్యార్థులకు సెల్ ఆంక్షలు విధిస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. కళాశాలలు, పరిసరాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్లను అనుమతించే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధునిక యుగంలో సెల్‌ఫోన్ ప్రతిఒక్కరి జీవితంలో భాగంగా మారింది. సెల్‌ఫోన్ అంటూ లేని వారు ఉండరు. ప్రధానంగా స్మార్ట్ ఫోన్ల రాక, సరికొత్త యాప్‌ల ప్రవేశం యువత మీద పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పవచ్చు. సమాచారం ముసుగులో తప్పుదోవ పట్టించే వెబ్ సైట్లు పుట్టుకురావడంతో దానిని తమకు అనుకూలంగా మలచుకునే వాళ్లు క్రమంగా పెరుగుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో యువతులు, మహిళల వీడియోలు, ఫొటోలను వారికి తెలియకుండా చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా అనేక కళాశాలల్లో ఆకతాయిలు, యువత శ్రుతి మించి వ్యవహరిస్తున్నారంటూ యువతులు, విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు విద్యాశాఖకు హోరెత్తాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ కళాశాలల విభాగం డైరెక్టర్ చారులత ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
ఇక సెల్‌పై నిషేధం: ఇప్పటికే అనేక ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులకు డ్రెస్‌కోడ్ అమల్లో ఉంది. అయితే, అమల్లో విఫలం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలల్లో సెల్‌ఫోన్లపై నిషేధం విధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం సాహసోపేత నిర్ణయమే. ఇప్పటి వరకు పాఠశాలల్లోకి సెల్‌ఫోన్ల నిషేధం అమల్లో ఉంది. దీనిని కట్టడి చేయడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలల్లో నిషేధం అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, తదితర అన్ని కళాశాలలకు ఈ నిషేధం వర్తింప చేశారు. సెల్‌ఫోన్ కారణంగా విద్యార్థుల దృష్టి పాఠ్యాంశాల మీద కాకుండా, మరో వైపుగా మరలుతోందని, అందుకే ఈ నిషేధం అని డైరెక్టర్ చారులత తన ఉత్తర్వుల్లో వివరించారు. ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ ఉత్తర్వులు జారీ చేసి, తప్పనిసరిగా అమలు చేయించి తీరాలని ఆదేశించారు.
ప్రధానంగా కో ఎడ్యుకేషన్ కళాశాలల నుంచి తమకు ఫిర్యాదులు అత్యధికంగా వచ్చాయని, యువతులు, విద్యార్థినులు తమ ఆవేదనను వ్యక్తం చేశారని వివరించారు. తమను వీడియో, ఫొటో చిత్రీకరించడం, బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అలాగే, పరీక్షల్లో సెల్ ఆధారంగా అవకతవకలకు పాల్పడే విద్యార్థులు సైతం ఉన్న దృష్ట్యా, నిషేధం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, విద్యార్థులు కళాశాలల ఆవరణ, తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లను తీసుకురావడానికి వీలులేదని హెచ్చరించారు. తొలిసారి పట్టుబడితే క్షమించడం జరుగుతుందని, మళ్లీ మళ్లీ సెల్‌ఫోన్లతో పట్టుబడితే క్రమశిక్షణ చర్యలు తప్పదన్నట్టు ఆ జీఓలో పేర్కొనడం గమనార్హం. గతంలో అన్నావర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సెల్‌ఫోన్ నిషేధం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడం, నిషేధం అమలు చేయలేక చేతులేత్తేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ దృష్ట్యా, ప్రభుత్వ కళాశాలల్లో ఈ నిషేధం అమలుకు ఏ మేరకు అధికారులు శ్రమించాల్సి ఉంటుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment