ఓస్లో: నార్వేలోని ఆ పట్టణంలో మరణం నిషేధం. ఆర్కిటిక్ ద్వీపకల్ప ప్రాంతంలో ‘లాంగ్యర్‌బీన్’ అనే ఆ బొగ్గుగనుల పట్టణంలో అతి శీతల ఉష్ణోగ్రతల వల్ల మృతదేహాలు ఎన్నటికి మట్టిలో కలిసే పరిస్థితి లేదు. అందువల్ల మృతదేహాలతో పాటు వాటిలోని వైరస్, బ్యాక్టీరియాలు కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ భయంతోనే అక్కడ చావుపై పూర్తిగా నిషేధమే పెట్టారు. అందుకోసం 2017లో ఓ చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. 1918లో స్పానిష్ ఫ్లూ వైరస్ బారిన పడి మరణించిన వారి మృతదేహాల్లో ఇప్పటికీ ఆ ఫ్లూ జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఎందుకీ పరిస్థితి..
నార్వే ఉత్తర ప్రాంతంలో మారుమూల స్వాల్‌బార్డ్ ద్వీపకల్పాల సమూహంలో ఉన్న లాంగ్యర్‌బీన్ పట్టణ జనాభా దాదాపు 2 వేలు. ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రత –17 డిగ్రీలు కాగా అత్యల్పంగా –46.3 డిగ్రీలకు పడిపోతుంది. ఏడాదిలో నాలుగు నెలల పాటు సూర్యుడి జాడే ఉండదు. భూమిలో ‘పెర్మ ఫ్రాస్ట్’ అనే వాతావరణ పరిస్థితి కారణంగా పాతిపెట్టిన మృతదేహాలు కుళ్లిపోవు. దీనిని 1950లో అధికారులు గుర్తించారు. పెర్మా ఫ్రాస్ట్ అంటే మట్టి లేదా రాతిలో ఉష్ణోగ్రతలు ఎప్పటికీ సున్నా లేదా అంతకంటే తక్కువ డిగ్రీలు ఉండడమే.. ఈ పరిస్థితి కారణంగా చాలా సందర్భాల్లో మృతదేహాలు భూమి ఉపరితలంపైకి కూడా వచ్చేస్తాయి. 1950 తర్వాత ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలు పెట్టారు.
మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ జాడలు
1918లో ప్రాణాంతక ‘స్పానిష్ ఫ్లూ వైరస్’ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో మరణించిన వారి 11 మృతదేహాలు ఇప్పటికీ లాంగ్యర్‌బీన్‌లో ఉన్నాయి. ‘పెర్మ ఫ్రాస్ట్’ ప్రభావంతో ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే ఆ మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ వైరస్ కూడా ఇంకా సజీవంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 1998, ఆగస్టులో నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్‌కు చెందిన కర్‌స్టి డంకన్ లాంగ్యర్‌బీన్‌లో పరిశోధనలు నిర్వహించారు. ఫ్లూతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఇంకా బతికే ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.
మరణాల్ని నిషేధిస్తూ 2017లో చట్టం..
భూమి శాశ్వతంగా ఘనీభవన స్థితిలో ఉండడంతో పాతిపెట్టిన శవాలు కుళ్లిపోకుండా.. ఉపరితలం పైకి వస్తున్నందున 2017లో అక్కడ మరణాలపై చట్టం చేసినట్లు నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ క్రిస్టియన్ మేయర్ తెలిపారు. అక్కడ ప్రాణాంతక వైరస్ స్థానికులకు సోకకుండా ఉండేందుకు మరణానికి చేరువలో ఉన్న వారిని నార్వేలోని ప్రధాన భూభాగానికి వెంటనే తరలిస్తారు. ఒకవేళ ఎవరైనా అకస్మాత్తుగా అక్కడ మరణించినా, అక్కడే మరణించాలని కోరుకున్నా.. వారి అంతిమ సంస్కారాల్ని అక్కడ నిర్వహించరు. అయితే వారి అస్థికలను అక్కడి భూమిలో పూడ్చేందుకు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం.
అక్కడ మరణం నిషేధం
Published Wed, Feb 14 2018 2:07 AM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment