
ముజఫర్‌పూర్ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల తీరును తప్పుపడుతున్నారు.
ముజఫర్‌పూర్ : ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరిగిన అకృత్యాల నేపథ్యంలో బిహార్ సీఎం రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఒకేఒక్క ప్రతికూల ఉదంతంపైనే దృష్టిసారిస్తున్నారని విపక్షాలు, మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన దారుణ ఘటనపై నిందితులను ఏఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవడంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టిసారించండని హితవు పలికారు. ఒక దురదృష్టకర ఘటననే పదేపదే ప్రస్తావించడం తగదన్నారు. మరోవైపు ముజఫర్‌పూర్ ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారనే కారణంతో ఆరుగురు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.