
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఘటనకు నిరసనగా ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ధర్నాలో వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకుల హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ నేత డీ. రాజా, శరద్‌యాదవ్, మిసా భారతీ, సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి హజరైయ్యారు.
ముజఫర్‌పూర్‌లోని ఓ బాలికల వసతి గృహంలో అధికారులు 40 మంది బాలికలపై అత్యాచారం జరిపిన ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. వసతి గృహం నిర్వహకుడు, ఘటనలో ప్రధాన నిందితుడైన బ్రిజేష్ కుమార్‌కు మరణశిక్ష విధించాలని తేజస్వీ డిమాండ్ చేశారు. నితీష్ కుమార్‌కు బ్రిజేష్ అత్యంత సన్నిహితుడని, ప్రభుత్వం అతన్ని కాపాడుతోందని తేజస్వీ ఆరోపించారు. బిహార్‌లో 40 నిర్భయ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన మొత్తం ప్రభుత్వాన్ని కదిలిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఘటనపై విచారణ జరిపి నిందితులందరికి మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో నితీష్ కుమార్‌పై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తొన్న విషయం తెలిసిందే.