దేవుడికీ మద్యం చుక్క దొరకడం లేదు!
బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం మద్యంపై సంపూర్ణ నిషేధం విధించడంతో చిన్నపాటి కల్లోలమే రేగుతోంది. మద్యం దొరకక మందుబాబులు కిందామీదా పడుతుండగా.. ఆఖరికీ దేవుళ్లకు నైవేద్యంగా నివేదించేందుకు కూడా 'మద్యం' చుక్క దొరకకడం లేదు. బిహార్‌లో చాలాచోట్ల దేవుడి విగ్రహాలకు కల్లు, దేశీ మద్యమైన లిక్కర్‌ను సాకపెడతారు. ఇలా మద్యాన్ని సాక పెట్టడం, నివేదించడం కొన్నిఆలయాల్లో తప్పనిసరి కూడా.
అయితే, మద్యంపై నిషేధం వల్ల దళితులు, మహా దళితులు కొలిచే దాక్ బాబా, మసాన్ బాబా, గొరైయ బాబా, దిహ్వాల్ బాబా, నౌఖా బాబా, భైరవ్ తదితర దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించేందుకు మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం నిషేధం వల్ల గయాలోని పలు ప్రముఖ ఆలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. భక్తులు లేకపోవడంతో పూజారులు గోళ్లు గిల్లుకునే పరిస్థితి నెలకొంది.
'మా దేవుడు కపాల్ భైరవ మద్యాన్ని మాత్రమే సురపానంగా స్వీకరిస్తారు. కానీ నిషేధం వల్ల దాదాపు 40శాతం భక్తులు ఆలయానికి రావడం మానేశారు' అని గోదావరి మోహల్లా భైరవస్థాన్ ఆలయ పూజారి అనంత్ మరాథే తెలిపారు. డాక్ బాబా, సంషాన్ బాబా ఆలయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం నిషేధం వల్ల భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. తమ దేవుళ్లకు ఇష్టపానమైన మద్యాన్ని ఎలా సమర్పించాలో తెలియక వారు కూడా అవస్థలు పడుతున్నారు.