పట్నా: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పేరుతో ఓ ప్రబుద్ధుడు 42 సార్లు దరఖాస్తు చేసి ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు కుచ్చుటోపి పెట్టిన ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైశాలీ జిల్లాలోని విష్ణుపూర్ రామ్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ చౌధరీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 42 సార్లు దరఖాస్తు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రతిసారీ కొత్త గుర్తింపు పత్రాలు దాఖలుచేయడం ద్వారా దాదాపు రూ.3,49,600 తీసుకున్నట్లు వెల్లడించారు.
అలాగే విశ్వేశ్వర్ రామ్ అనే వ్యక్తి మరుగుదొడ్డి కోసం 10 సార్లు దరఖాస్తు చేసి రూ.91,200 నొక్కేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలు 2015 ప్రథమార్ధంలో జరిగినట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయడంపై విచారణ చేయాల్సిందిగా సామాజిక కార్యకర్త రోహిత్ కుమార్ శనివారం వైశాలీ జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరారు. ఉన్నతస్థాయి విచారణ అనంతరమే ఈ ఘటనపై స్పందిస్తామని జిల్లా ఉప అభివృద్ధి అధికారి సర్వణయాన్ యాదవ్ తెలిపారు. బిహార్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12,000 ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment