మగద విశ్వవిద్యాలయం (నమూనా చిత్రం)
పాట్నా : పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపియింగ్‌కు బిహార్ పెట్టింది పేరు. అక్కడ పరీక్షలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది అయితే, ఆ రాష్ట్రం మాస్ కాపియింగ్‌లో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే, తాజాగా వెలుగు చూసిన అంశాల ప్రకారం అక్కడ విద్యావ్యవస్థే అంత దారుణంగా ఉందని, సరిగ్గా పాఠాలు చెప్పే గురువులే కరువయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా నైపుణ్యం లేని గురువులు, విషయ సంబంధ జ్ఞానం లేనివారు ఉన్నారని బయటపడింది. ఇంకా చెప్పాలంటే ముగ్గురు గణిత ప్రొఫెసర్లు బిహార్ విద్యావ్యవస్థ పరువు తీసినంత పనిచేశారు.
ఇటీవల తమకు గణితానికి సంబంధించిన ప్రొఫెసర్ కావాలంటూ బిహార్‌లో ప్రముఖ యూనివర్సిటీ అయిన 'మగద' ప్రకటన ఇచ్చింది. అంతకంటే ముందు తమ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లను పరీక్షించాలని అనుకుంది. వారి ముగ్గురుని పిలిచి సెలక్ట్ కమిటీ ముందు పరీక్షించగా కనీసం వారు తొమ్మిదో తరగతి లెక్కలు కూడా చేయలేకపోయారు. ఇక ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ట్రయాంగిల్ స్పెల్లింగ్‌ను ట్రాంగల్‌గా మార్చి చెప్పారు. మరో అసోసియేట్ ప్రొఫెసర్ కాస్త పర్వాలేదనిపించారు. దీనిపై వీసీ ప్రొఫెసర్ ఖమర్ అహసన్ స్పందించేందుకు నిరాకరించారు. కాగా, అంతకుముందు నిర్వహించిన ఇంటర్వ్యూలను వీడియో తీసి సిండికేట్ ముందుకు సీల్డ్ కవర్‌లో తీసుకెళ్లారు. ఆ ప్రొఫెసర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అక్కడి వారంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.