బిహార్ టాపర్ల సత్తా ఏపాటిదో తేలిపోయింది. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారని చెప్పిన రుబీ రాయ్.. బిహార్ బోర్డు పెట్టిన రెండో పరీక్షకు డుమ్మా కొట్టింది. తనకు ఆరోగ్యం బాగోనందున మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరినట్లు బోర్డువర్గాలు తెలిపాయి. అయితే అందుకు బోర్డు అంగీకరించలేదు. అది కేవలం వంక మాత్రమేనని, ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ చెప్పారు. బిహార్ 12వ తరగతి పరీక్షలలో టాపర్లుగా వచ్చినవాళ్లను అక్కడి స్థానిక టీవీ చానల్ ఒకటి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్లు చిత్రమైన సమాధానాలు చెప్పారు. సైన్స్ టాపర్ అయిన సౌరభ్ కుమార్ అయితే.. నీళ్లకు, హెచ్2ఓకు సంబంధం ఏంటో చెప్పలేకపోయాడు.
ఇలా పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి బుక్కయిన టాపర్లందరికీ మళ్లీ చిన్నపాటి పరీక్ష, ఇంటర్వ్యూ పెడతామని బోర్డు చెప్పింది. ఆ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుంచి ఐదారు ప్రశ్నలుంటాయి. వాటికి వాళ్లు రాసిన సమాధానాలను, జవాబు పత్రాల్లోని వాళ్ల చేతిరాతను కూడా పోల్చి చూస్తారు. ఇలా రెండోసారి నిర్వహించిన పరీక్షకు రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. మిగిలినవాళ్లు పరీక్ష రాశారు. వాటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. అప్పుడు నిజంగా వాళ్లలో సరుకెంతో తేలిపోతుంది.
వీళ్ల బదులు వేరేవాళ్లు పరీక్షలు రాసి ఉండొచ్చని, లేదా వాళ్లు రాసిన ఆన్సర్ షీట్లను ఎవరో మార్చి ఉండొచ్చని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ల ఫలితాలు తేడాగా వస్తే తొలుత పరీక్షలు రాసినప్పుడు ఉన్న ఇన్విజిలేటర్లు, పేపర్లు దిద్దినవాళ్లు.. అందరిపై చర్యలు తప్పవు.
పరీక్షకు డుమ్మాకొట్టిన టాపర్
Published Sat, Jun 4 2016 8:44 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement
Advertisement