ఆ టాపర్లకు మళ్లీ పరీక్షలు
తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండానే టాపర్లుగా నిలిచిన 14 మందికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బిహార్ పాఠశాల పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) నిర్ణయించింది. నిజంగా వాళ్లంతా ఇంటర్ టాపర్లు అయ్యే అర్హత కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. పొలిటికల్ సైన్స్ అంటే పనికిరాని సైన్స్ అని రూబీ రే అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్‌చల్ సృష్టించింది. దాంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు.
పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని రూబీకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది. ఇక సైన్స్ టాపర్ సౌరవ్ శ్రేష్ఠ కూడా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అల్యూమినియంను యాక్టివ్ మెటల్ అని చెప్పి, సోడియం, ఎలక్ట్రాన్‌లు అంటే ఏంటో తెలియదన్నాడు.
ఈ వ్యవహారంతో కంగుతిన్న బీఎస్‌ఈబీ అధికారులు వీళ్లందరికీ మళ్లీ పరీక్షలు పెట్టాలని నిర్ణయించారు. వారికి చిన్న రాతపరీక్షతో పాటు ఒక ఇంటర్వ్యూ కూడా పెడతామని బీఎస్‌ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ తెలిపారు. అందులో టాపర్లు ఫెయిలైతే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అంతేకాదు.. పరీక్షల్లో వాళ్ల పేపర్లు దిద్దిన అధ్యాపకులు, ఇన్విజిలేటర్లపై కూడా చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి చెప్పారు. రూబీ, సౌరవ్ ఇద్దరూ వైశాలిలోని విషుణ్ రే కాలేజిలో చదివారు.