
బైకు చుట్టూ తిరుగుతున్న పులులు.. బిగుసుకుపోయిన బైకిస్టులు
సాక్షి, మహారాష్ట్ర : కొన్ని సంఘటనలు చూస్తే చావు అనేది నిజానికి ముందే రాసిపెట్టి ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. ఒక్కోసారి పెద్ద కారణం లేకుండానే ప్రాణాలు పోవడం మరోసారి ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలు నిలవడంవంటి సంఘటనలు ఈ అనుమానాలకు కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పులి ఎదురుపడిందంటేనే ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవచ్చు. ఒక వేళ కారులాంటి వాహనాల్లో ఉంటే సురక్షితంగా ఉండొచ్చేమోగానీ, ఖర్మకు నడిచి వెళుతున్న సమయంలో బైక్‌పై వెళ్లే సమయంలో ఎదురైతే ఇక అంతే మరి. కానీ, మహారాష్ట్రలో ఓ ఇద్దరు వ్యక్తులు పులులకు ఎదురై ప్రాణాలతో బయటపడ్డారు. ఎదురవడమంటే అదేదో దూరంగా కాదు.. ఆ పులులు గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా వారి చుట్టూ తిరిగాయి కూడా.
మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ చోట ఆగి ఉండగా అనూహ్యంగా రెండు పెద్ద పులులు వారి దగ్గరకు వచ్చాయి. వాటిని చూడగానే భయంతో వారు బిగుసుకుపోయారు. బహుశా! అవి అప్పటికే ఆహారం పూర్తి చేసుకొని ఉన్నాయనుకుంటా.. ఓ పులి తనకెందుకులే అన్నట్లు బైక్‌పక్కనే కూర్చొగో మరో పులి మాత్రం వారి బైక్ చుట్టూ తిరుగుతూ వారిని ఎగాదిగా చూసింది. ఆ చూపుకే వారికి గుండెలు జారిపోయాయి. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న కారులోని వ్యక్తులు బైక్‌పై ఉన్న వారిని ఎటు కదలొద్దని, ఏంచేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దాదాపు నాలుగు నిమిషాలపాటు ఆ పులులు చేసిన పనికి వారికి ముచ్చెమటలుపట్టి ప్రాణాలు గాల్లోనే పోయాయ్ అన్నంతలా మారిపోయారు. అదృష్టం కొద్ది ఆ పులులు కాస్తంత దారివ్వగానే వేగంగా కారులో వాళ్లు వారిని సమీపించి కారులో ఎక్కించుకొని భద్రంగా తీసుకెళ్లారు. బహుశా భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో!
Comments
Please login to add a commentAdd a comment