రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణను పూర్తిచేయడం తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అవినీతి నిరోధక సవరణ బిల్లు-2013ను సిబ్బంది శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మంత్రులు సహా ప్రభుత్వాధికారులపై తగిన కోర్టులో ఫిర్యాదు చేసినట్లయితేనే ప్రభుత్వం వారి విచారణకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. అవినీతి ఆరోపణలున్న ప్రభుత్వాధికారులపై విచారణకు అనుమతించే విషయాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత యంత్రాంగం మూడు నెలల్లో తేల్చి చెప్పాల్సి ఉంటుంది.
అటార్నీ జనరల్ లేదా అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదింపుల తర్వాత ఈ గడువును గరిష్టంగా మరో నెలరోజులు పొడిగించొచ్చు. అవినీతి కేసులకు సంబంధించి ప్రభుత్వాధికారులపై విచారణకు సంబంధిత శాఖకు చెందిన మంత్రి అనుమతి ఇస్తారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులపై విచారణకు ప్రధాని అనుమతి ఇస్తారు. 2జీ కేసులో మాజీ మంత్రి రాజాపై విచారణకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని 16 నెలలు గడిచినా, ప్రధాని కార్యాలయం స్పందించలేదంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై ప్రభుత్వానికి అక్షింతలు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ముందుకు తెచ్చింది.
నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణ!
Published Tue, Aug 20 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement