మృతదేహాన్ని బైక్ కు కట్టి...
భువనేశ్వర్: సాధారణంగా ఎలాంటివారైనా మృతదేహాల పట్ల కనీస మర్యాద పాటించడం ఆనవాయితీ.... ఒకింత భయపడటం కూడా తెలిసిందే. అయితే ఒడిషాలోని నబరంగపూర్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పేదరికమో, నిర్లక్ష్యమో, తెలియదుగానీ ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకొని వెళ్లడం ఆందోళన రేపింది.
వివరాల్లోకి వెళితే భారాముండా గ్రామంలో ఓ మహళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్ని, బైక్ పై వెనకాల కట్టుకుని ఇద్దరు తీసుకెళుతున్న దృశ్యాలు భీతి గొల్పాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక వారు అలా చేశారా? లేక వాహనంలో తరలించేందుకు అవసరమైన డబ్బులు లేక అలా చేశారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా ఆ చుట్టుపక్కల 20కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. మృతదేహాలను తరలించేందుకు వీలుగా పేదలకోసం వీటిని అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు. కాగా ఇలాంటి సంఘటన బరంగపూర్ జిల్లాలో గతంలో కూడా చోటు చేసుకుంది. కొన్ని నెలక్రితం చాలనగూడ దగ్గర ఆత్మహత్య చేసుకున్న రైతు డెడ్ బాడీని ఇదే తరహాలో పోస్ట్ మార్టం కోసం తరలించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.