పార్లమెంట్లో ముఖ్యమంత్రిపై తీవ్రవ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సభలో లేనివారి గురించి మాట్లాడటం సభ్యత కాదని తెలిసినా, స్పీకర్ స్థానం వారిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి. 'ఆ ముఖ్యమంత్రి అరచకవాది.. నాటకాలాడుతున్నారు.. ఈ సీఎంను ఏదోఒకటి చెయ్యాలి..' అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం లోక్ సభలో జీరోఅవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో అమలవుతున్న 'సరి-బేసి' విధానంపై జీరో అవర్ లో చర్చను లేవనెత్తిన ఎంపీ రమేశ్.. ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలను దాటవేస్తున్నారని కేజ్రీవాల్ పై మండిపడ్డారు.
'కేజ్రీవాల్ ఒక అచారకవాది. ముఖ్యమైన సమస్యలేవీ ఆయనకు పట్టవు. అన్నీ వదిలేసి 'సరి బేసి' విధానమంటూ నాటకాలాడుతున్నారు. ఢిల్లీలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దానిపై సీఎం మాట్లాడరు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకోసం మెట్రోరైల్ పొడగించాలంటే ఆయన ముందుకు కదలరు' అని ఎంపీ రమేశ్ సభలో ఆవేశపూరితంగా మాట్లాడారు. జనవరి నాటికి ఢిల్లీ మెట్రో నాలుగో ఫేస్ పనులు మొదలుకావాల్సి ఉండగా, సీఎం నిర్లక్ష్యం వల్లే నేటికి పనులు ప్రారంభంకాలేదని, ఆ పనిని త్వరగా పూర్తిచేయగలిగితే దక్షిణ ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కీలక ఫైళ్లు సీఎం కార్యాలయంలో మగ్గుతున్నాయన్నారు. కేజ్రీవాల్ తీరు చూస్తే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నట్లుందని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రిని ఏదో ఒకటి చెయ్యాలని సభద్వారా కోరుకుంటున్నట్లు రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు సహచర బీజేపీలు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.